Begin typing your search above and press return to search.

భారత్ ఎన్నికల్లో అమెరికా నిధులు... వీణారెడ్డిపై విచారణ డిమాండ్!

తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి వీణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈమె ఎవరు.. అమెరికా నుంచి భారత్ లో జరిగే ఎన్నికలకు నిధుల సాయాన్ని అందించడంలో ఈమె పాత్ర ఎంత మొదలైన విషయాలపై ఇప్పుడు చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 4:30 PM GMT
భారత్ ఎన్నికల్లో అమెరికా నిధులు... వీణారెడ్డిపై విచారణ డిమాండ్!
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో జరిగిన ఎన్నికల్లో అగ్రరాజ్యం అమెరికా నిధుల పాత్ర ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ నిధులను నిలిపివేస్తున్నట్లు 'డోజ్' సారథి ఎలాన్ మస్క్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ లో వీణా రెడ్డి పాత్రపై చర్చ మొదలైంది.

అవును... భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్లు (రూ.186 కోట్లు) సాయాన్ని రద్దు చేసినట్లు డోజ్ పేర్కొంది. డోజ్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇదే సమయంలో.. భారత్ లో ఏదో ఒక రాజకీయ పార్టీకి బైడెన్ ఈ సాయం చేసి ఉంటారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో... తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి వీణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈమె ఎవరు.. అమెరికా నుంచి భారత్ లో జరిగే ఎన్నికలకు నిధుల సాయాన్ని అందించడంలో ఈమె పాత్ర ఎంత మొదలైన విషయాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ సమయంలో బీజేపీ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చింది.

యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ ఎయిడ్) ఇండియా కు 2021 - 24 మధ్య వీణారెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈమె 2021లో భారత్ కు వచ్చి 2024 లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అమెరికాకు తిరిగి వెళ్లారని అంటున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ఎక్స్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు.

వీణారెడ్డి యుఎస్ ఎయిడ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అమెరికా నుంచి భారత్ కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోందని.. అమెరికా సాయంతో భారత్ లో ఓటర్ టర్నవుట్ పెరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఇప్పటికే ఎక్స్ వేదికగా వెళ్లడించారు.

ఈ నేపథ్యంలో... వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ తాజాగా ట్వీట్ చేయడంతో ఆమె పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.