Begin typing your search above and press return to search.

ట్రంప్ తో చిన్న తేడాలే.. అతన్నే ఫాలో అవుతానన్నాడు

భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవిని ఆశించటమే కాదు.. ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:10 AM GMT
ట్రంప్ తో చిన్న తేడాలే.. అతన్నే ఫాలో అవుతానన్నాడు
X

భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవిని ఆశించటమే కాదు.. ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఇంటిని గెలిచి.. తర్వాత వీధిని గెలవాలన్న సూత్రాన్ని బాగానే వంట బట్టించుకున్న వైనం ఆయన మాటల్ని చూస్తే అర్థమవుతుంది. సొంత పార్టీకి చెందిన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అధిగమించే క్రమంలో ఆయన చాలా మాటలే చెబుతున్నారు. ఇలాంటి వేళ.. ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సిన వివేక్.. అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి ప్రశంసల్ని పొందటం విశేషం.

ఈ మధ్యనే వివేక్ పై సానుకూల వ్యాఖ్యలు చేయటంతో పాటు.. ఆయన తీరును ట్రంప్ ప్రశంసించిన వైనం తెలిసిందే. అందుకు ప్రతిగా తాజాగా వివేక్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ట్రంప్ తో తనకు చిన్నపాటి భేధాభిప్రాయాలు ఉన్నాయే తప్పించి.. పాలసీల విషయంలో ఇద్దరిది ఒకే బాటగా చెప్పటం ద్వారా.. ట్రంప్ అభిమానులకు గాలం వేసినట్లుగా చెప్పాలి. విద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసే ట్రంప్.. అమెరికా ఫస్ట్ పేరుతో వినిపించే వాదనలు పలువురికి అభ్యంతరకరంగా ఉంటాయి.

ఈ విషయంలో ట్రంప్ తోనే తాను ఉన్నట్లుగా చెప్పటం ద్వారా ట్రంప్ అభిమానులకు సైతం అసలుసిసలు ప్రత్యామ్నాయంగా వివేక్ నిలిచేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. ట్రంప్ మాదిరే ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో సాగే అభ్యర్థులుగా పేర్కొన్నారు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన.. తమ ఆలోచనల్ని పంచుకోవటం ద్వారా దేశాన్ని పునరేకీకరణ దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందన్న వివేక్.. ‘గతంలో ట్రంప్ వేసిన పునాది నుంచి మరింత ముందుకు దేశాన్ని తీసుకెళతాం’ అంటూ స్పష్టంచేశారు.

అంతేకాదు.. పాలసీల విషయంలో తామిద్దరిది ఆలోచనలు ఒకేలా ఉంటాయని చెబుతూనే.. మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. అయితే.. స్వల్ప విభేదాలున్న మాట వాస్తవమే. వాటిపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తా. దక్షిణ సరిహద్దుల్లో గోడ కట్టటం కంటే సైన్యాన్ని మోహరించటానికే ప్రాధాన్యమిస్తా. దేశ విద్యాశాఖను మూసేస్తా’ అంటూ ట్రంప్ అనుకూల వర్గాన్ని ఆకర్షించటమే కాదు.. ఆయన్ను తప్పు పట్టేవారికి సైతం నచ్చేలా మాట్లాడటం ద్వారా.. అందరికి ఆమోదయోగ్యమైన నేతగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటున్న తీరు చూస్తే.. వివేక్ రామస్వామి మామూలోడు కాదు.. మహా ఘటికుడన్న భావన కలుగక మానదు.