Begin typing your search above and press return to search.

వాల్ మార్ట్ ఒవెన్ లో భారతీయ యువతి మృతదేహం... అసలేం జరిగింది?

ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ సందర్భంగా అటు కంపెనీ, ఇటు పోలీసులు ఈ ఘటనపై స్పందించారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 6:26 AM GMT
వాల్ మార్ట్ ఒవెన్  లో భారతీయ యువతి మృతదేహం... అసలేం జరిగింది?
X

కెనడాలో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. బేకరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఓ భారతీయ యువతి (19) వాక్-ఇన్ ఒవెన్ లో మృతిచెందినట్లు గుర్తించబడింది. అయితే... ఆమె ఆ విధంగా మృతి చెందడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ సందర్భంగా అటు కంపెనీ, ఇటు పోలీసులు ఈ ఘటనపై స్పందించారు.

అవును... కెనడాలోని హోలిఫాక్స్ లోగల వాల్ మార్ట్ స్టోర్ లోని బేకరీ డిపార్ట్మెంట్ లో సిక్కు కమ్యునిటీకి చెందిన ఓ భారతీయ యువతి పని చేస్తుంది! ఆమె ఇటీవలే భారతదేశం నుంచి కెనడాకు వెళ్లి దుకాణంలో పనిచేస్తోందని అంటున్నారు. అయితే... ఆమె మృతదేహం వాక్-ఇన్ ఒవెన్ లో కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

ఈ విషయాలపై స్పందించిన పోలీసులు శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో 6990 మమ్ ఫోర్డ్ రోడ్ లోని వాల్ మార్ట్ వద్ద ఈ మరణానికి సంబంధించి సమాచారం అందిందని తెలిపారు. వెళ్లి చూసేసరికి ఆమె మృతదేహం ఒవెన్ లో కనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా.. మారిటైమ్ సిక్కు సొసైటీ సీటీవీ తో మాట్లాడింది.

ఈ సందర్భంగా మృతురాలు తమ సంఘంలోని సభ్యురాలే అని ధృవీకరించింది. ఈ ఘటన తమకు, ఆమె కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగిస్తోందని.. ఆమె మంచి భవిష్యత్తు కోసం కెనడాకు వచ్చి ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయిందని అన్నారు. ఆమె ఇటీవలే ఇండియా నుంచి కెనడాకు వచ్చినట్లు తెలిపారు.

ఇదే సమయంలో... హెచ్.ఆర్.పీ. కానిస్టేబుల్ మార్టిన్ క్రోంవెల్ మాట్లాడుతు.. సదరు యువతికి మృతి గురించి సోషల్ మీడియాలో ఊహాజనిత సమాచారన్ని పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. విచారణ కొనసాగుతోందని అన్నారు.