కువైట్ లో విగతజీవిగా కేరళ మహిళ... శరీరంపై కాలిన, కోసిన గాయాలు!
వివరాళ్లోకి వెళ్తే... వాయనాడ్ కు చెందిన అజిత అనే మహిళ కువైట్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది.
By: Tupaki Desk | 1 Jun 2024 9:36 AM GMTదేశంలో సరైన అవకాశాలు రాకో.. లేక, మరింత మెరుగైన జీవితం దక్కుతుందనే ఆశతోనో చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా కువైట్, దుబాయ్, మస్కట్, సౌదీ వంటి దేశాలకు భారత్ నుంచి మహిళలు కూడా ఎక్కువగా ఇంటిపనుల నిమిత్తం వేళ్తుంటారు. ఈ క్రమంలో అలా వెళ్లిన ఓ మహిళ విగతజీవిగా మారడం తీవ్ర కలకలం రేపింది.
అవును... ఉపాధి వెతుక్కుంటూ కేరళ నుంచి కువైట్ కు సుమారు ఆరు నెలల క్రితం వెళ్లిన ఓ మహిళ విగతజీవిగా మారింది. ఆమె మరణానికి కారణం.. యజమాని పెట్టిన చిత్రహింసలే అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు... శరీరంపై కాలిన గాయాలు, కోసిన గాయాలు ఉన్నట్లు గుర్తించారని తెలుస్తుంది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారట.
వివరాళ్లోకి వెళ్తే... వాయనాడ్ కు చెందిన అజిత అనే మహిళ కువైట్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ సమయంలో సుమారు ఆరు నెలలుగా ఆమె ఆ ఇంట్లో చెప్పుకోలేని చిత్రహింసలకు గురైందని తెలుస్తుంది. ఆ ఇంటి యజమాని ఆమెను శారీరకంగా, మానసికంగా విపరీతంగా వేదించాడట. బ్రతికుండగానే ప్రత్యక్ష నరకం చూపించాడనే విషయం ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూస్తే తెలుస్తుందని అంటున్నారు.
అప్పటికే ఆమె పరిస్థితి ఇంక ఏమాత్రం భరించలేని స్థితికి చేరుకోవడంతోనో ఏమో కానీ... మే 15న తన భర్త విజయన్ కు వీడియో కాల్ చేసిన అజిత.. అక్కడ తన పరిస్థితి ఏమీ బాగాలేదని, త్వరలో తిరిగి వచ్చేస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు. దీంతో ఆమెను గల్ఫ్ పంపినటువంటి ఎర్నాకులంలోని ఏజెన్సీకి విషయం చెప్పారంట.
ఈ సమయంలో... ఏజెన్సీ నుంచి ఆరా తీయడంతో కువైట్ లోని ఆ ఇంటి యజమాని ఆమె ఫోన్ ను లాక్కున్నారని అజిత భర్త చెబుతున్నారు. మే 18న ఆమె తిరిగి ఇండియాకు రావడానికి టిక్కెట్ కూడా బుక్ చేసుకుందనే విషయం ఏజెన్సీ అధికారులు తనకు చెప్పారని అంటున్నారు. అయితే... విమానం బయలుదేరిన తర్వాత కూడా ఆమె నుంచి ఎలాంటి కమ్యునికేషన్ లేకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఏజెన్సీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సమయంలో ఆమె ఉరి వేసుకుని మృతిచెందినట్లు స్థానిక పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. ఇదే సమయంలో... ఆమె శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలతోపాటు, పదునైన ఆయుదాలతో కోసిన గాయాలూ ఉన్నాయని అంటున్నారు. పైగా ఆమెకు చాలా రోజులుగా ఆహారం ఇవ్వలేదని, తీవ్రంగా కొట్టడం వల్ల దవడ ఎముకలు కూడా విరిగిపోయాయని.. ఆమెకు న్యాయం చేయాలని భర్త విజయన్ కోరుతున్నారు.
కేవలం ఇంటి యజమాని క్రూరంగా ప్రవర్తించడంతోనే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ... జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసులు, కేరళ ముఖ్యమంత్రిని విజయన్ వేడుకుంటున్నారు.