Begin typing your search above and press return to search.

దావోస్ లో చేసుకున్న రూ.1.25లక్షల కోట్ల డీల్స్ లోతుల్లోకి వెళితే!

By:  Tupaki Desk   |   1 Jun 2022 4:30 AM GMT
దావోస్ లో చేసుకున్న రూ.1.25లక్షల కోట్ల డీల్స్ లోతుల్లోకి వెళితే!
X
ఏపీ రాష్ట్రంలో పెట్టబడుల వరద పారించేందుకు ప్రత్యేక విమానంలో తాను.. తన సతీమణితో కలిసి దావోస్ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి.. తన టీంను మరో ఫ్లైట్ లో దావోస్ పంపిన వైనం తెలిసిందే. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఏపీ సర్కారు.. అందుకు తగ్గట్లే రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లుగా అధికార పార్టీనేతలు చెబుతున్నారు. మరి.. నిజంగానే రాష్ట్రానికి రూ.1.25లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే అంతకు మించిన గొప్ప విషయం మరొకటి ఉండదు. మరి.. ఇప్పుడు వినిపిస్తున్న విమర్శల మాటేమిటి? అన్న సందేహానికి సమాధానాన్ని వెతికితే ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు వెలుగు చూస్తాయి.

దావోస్ వెళ్లిన ఏపీ ప్రభుత్వం.. అక్కడ మూడు సంస్థలతో విద్యుత్ రంగంలో ఒప్పందాలు చేసుకోవటాన్ని తప్పు పడుతున్నారు. దాని కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. విఖ్యాత కంపెనీలు.. పారిశ్రామికవేత్తలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నట్లుగా సీఎం కార్యాలయం దావోస్ పర్యటన మీద గొప్పులు చెప్పుకున్న పరిస్థితి. ఇంతకూ ఆ విఖ్యాత కంపెనీలు ఏమిటన్న లోతుల్లోకి వెళితే.. విస్మయానికి గురి కావాల్సిందే.

ఎందుకంటే.. జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న విఖ్యాత కంపెనీలు మరేమిటో కాదు.. ఒకటి.. అదానీ.. రెండోది గ్రీన్ కో.. మూడోది అరబిందో. అదానీసంస్థతో రూ.60 వేల కోట్లతో పది వేల మెగావాట్ల సౌర విద్యుత్.. 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు. గ్రీన్ కో సంస్థతో రూ.37 వేల కోట్లతో 8 వేల మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు అరబిందో రియాల్టీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో రూ.28వేల కోట్లతో ఆరువేల మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. గ్రీన్ కో సంస్థ ఆర్సెలర్ మిత్తల్ తో కలిసి ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది.

నిజానికి మిత్తల్ నిప్పన్ స్టీల్ లిమిటెడ్ తో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించి మరో ఒప్పందం చేసుకున్నా.. అదేమీ కొత్త ప్రాజెక్టు ఏమీ కాదంటున్నారు. పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన మూడు సంస్థలు ఏపీ అధికార పార్టీకి సన్నిహితమని చెబుతున్నారు. అదానీ విషయానికే వస్తే.. ఇప్పటికే క్రిష్ణ పట్నం.. గంగవరం పోర్టులు ఇప్పటికే అదానీ చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో.. తాజా ప్రాజెక్టులకు ఓకే చెప్పటం పెద్ద విషయం కాదనే చెప్పాలి. నిజానికి అదానీతో జగన్ సర్కారు జర్నీ చాలా విచిత్రంగా కనిపిస్తుంటుంది.

తాము అధికారంలోకి వచ్చినంతనే.. అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వంతో అదానీ చేసుకున్న ఒప్పందాల్ని.. ప్రాజెక్టుల్ని పెండింగ్ లో ఉంచేసింది. అనంతరం రూ.13వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా.. విశాఖలో 130 ఎకరాల భూమి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అదానీకి జగన్ సర్కారులో ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. ఇక.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన గ్రీన్ కో సంస్థ విషయానికి వస్తే.. దాని సీఈవో చలమలశెట్టి అనిల్. ఆయన సోదరుడు సునీత్ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే పీపీఏల సమీక్షల పేరుతో హడావుడి చేశారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం సునీల్ అధికార పార్టీకి సన్నిహితంగా మారారు. ఇటీవల కర్నూలు జిల్లాలో ఆ సంస్థ రూ.15వేల కోట్ల పెట్టబడులతో ఒప్పందాల్ని చేసుకున్నారు. ఇక.. జగన్ సర్కారుతో దావోస్ లో డీల్ చేసుకున్న మూడో సంస్థ అరబిందో విషయానికి వస్తే.. ఆ సంస్థ మరెవరిదో కాదు జగన్ కు అత్యంత సన్నిహితుడు.. విధేయుడు అయిన విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. జగన్ సర్కారు అధరికారంలోకి వచ్చాక కాకినాడ పోర్టు.. కాకినాడ ఎస్ఈ జెడ్ భూములు ఈ సంస్థ చేతుల్లోకే వెళ్లటం గమనార్హం.