Begin typing your search above and press return to search.

నోట్లు లేకున్నా... స‌గ‌టు జీవి ఖ‌ర్చు పెరిగిందే!

By:  Tupaki Desk   |   3 March 2017 4:29 AM GMT
నోట్లు లేకున్నా... స‌గ‌టు జీవి ఖ‌ర్చు పెరిగిందే!
X
ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి మూడో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక గ‌ణాంకాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన వేళ‌... ప‌లు ఆస‌క్తికర‌మైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. గ‌తేడాది న‌వంబ‌ర్ 8న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ... వెయ్యి- 500 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి రాత్రికి రాత్రే ఆ నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తెచ్చేశారు. ఫ‌లితంగా ఇప్ప‌టిదాకా మ‌న ఇళ్ల‌లోని పాత నోట్ల‌ను మార్చుకునే ప‌నిలో ప‌డిపోయాం. అదే స‌మ‌యంలో రోజువారీ ఖర్చుకు స‌రిప‌డ న‌గ‌దు జేబులో లేక నానా అవ‌స్థ‌లు ప‌డ్డాం. అస‌లు న‌వంబ‌ర్‌ - డిసెంబ‌ర్ నెల‌ల‌ను ఓ సారి గుర్తు చేసుకుంటే... మ‌నం జీవితంలో అలాంటి ప‌రిస్థితుల‌ను చూసి ఉండ‌మేమోన‌న్న భావ‌న క‌లుగుతుంది. బ్యాంకులు - ఏటీఎంల ముందు చాంతాడంత క్యూలు - బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బున్నా... ఖ‌ర్చు పెట్ట‌లేని దైన్యం - అత్య‌వ‌స‌రాల‌కు కూడా చేతిలో స‌రిప‌డ న‌గ‌దు లేక ఆగ్ర‌హావేశాకు గురైన వైనం అంద‌రికీ అనుభ‌వ‌మే. ఈ క్ర‌మంలో ఆ రెండు నెల‌ల్లో స‌గ‌టు జీవి ఖర్చు బాగానే త‌గ్గి ఉంటుంద‌ని మ‌నం అనుకుంటాం. కానీ... ఇందుకు విరుద్ధ‌మైన గ‌ణాంకాలు న‌మోద‌య్యాయి.

పెద్ద నోట్లు ర‌ద్దైన కీల‌క స‌మ‌యానికి చెందిన గ‌త త్రైమాసికం (ఆక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్‌)లో స‌గ‌టు జీవి ఖ‌ర్చు (ప్రైవేట్ స్పెండింగ్‌) ఏ ఒక్క‌రి ఊహ‌కు అంద‌ని విధంగా 10.1 శాతం మేర పెరిగింద‌ట‌. ఈ పెరుగుద‌ల ఈ ఏడాదిలోని తొలి రెండు త్రైమాసికాల్లోనే కాదండోయ్‌.. ఏకంగా గ‌డ‌చిన ఐదేళ్ల‌లో కూడా న‌మోదు కాలేద‌ట‌. అంటే స‌గ‌టు జీవి ఖ‌ర్చును పెద్ద నోట్ల ర‌ద్దు ఏమాత్రం ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింద‌న్న మాట‌. మారుతి సుజుకి కంపెనీ కార్ల కొనుగోళ్ల విష‌యానికే వ‌స్తే... ఈ త్రైమాసికంలో ఆ కంపెనీ కార్ల విక్ర‌యాల్లో కేవ‌లం 3.5 శాతం మాత్ర‌మే వృద్ధి న‌మోదు కాగా.. రెవెన్యూ ప‌రంగా మాత్రం ఆ కంపెనీ 12 శాతం మేర వృద్ధి సాధించిందిట‌. అంటే పెద్ద నోట్ల‌న్నీ ర‌ద్దైపోయిన‌ప్ప‌టికీ మారుతీకి చెందిన పెద్ద పెద్ద కార్లే ఎక్కువ‌గా అమ్ముడుబోయాయ‌న్న మాట‌. వెర‌సి పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత స‌గ‌టు జీవి ఖ‌ర్చు ఏమాత్రం త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత పెర‌గడం మోదీ స‌ర్కారును విమ‌ర్శించిన వారిని ఆలోచ‌న‌లోనే ప‌డేసింద‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/