Begin typing your search above and press return to search.

రోజుకు 10వేల కేసులు.. దేశాన్ని ‘ఒమిక్రాన్’ సునామీ తాకుతుందా?

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:07 AM GMT
రోజుకు 10వేల కేసులు.. దేశాన్ని ‘ఒమిక్రాన్’ సునామీ తాకుతుందా?
X
దేశాన్ని ‘ఒమిక్రాన్’ ముప్పు కమ్మేస్తోంది. చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముంబైలో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైనట్లుగా మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. మంగళవారం ఒక్కరోజులో కేసుల సంఖ్య 70 శాతం పెరిగాయి. తాజాగా 2510 కొత్త కేసులో ఏకంగా 82 శాతం ఎక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో కేసుల తీవ్రత రోజుకు పదివేలకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా ఆరు వారాల సమయంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో.. అదే స్థాయిలో తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నాయి. ఢిల్లీలో కేసులు పెరిగాయని.. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. వైద్య సేవలను ముమ్మరం చేస్తోంది. ముంబైలో థర్డ్ వేవ్ మొదలైందనే హెచ్చరికలతో ప్రజలు సైతం కోవిడ్ ప్రొటోకాల్ ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

-తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు.. నార్సంగిలో 31 మంది విద్యార్థులకు..తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38023 నమూనాలు పరీక్షించగా.. 235 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్ లో కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. మంగళవారం 17మందికి, బుధవారం మరో 17 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన మొత్తం విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటికే హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.

-ఏపీలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 141 కేసులు నమోదవగా.. తాజాగా 162 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో ఎవరూ చనిపోలేదు. జిల్లాల వారీగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 30 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,76,849కు చేరాయి. ఏపీలో కొత్తగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది.

-ఒమిక్రాన్, డెల్టా విజృంభిస్తే వైద్య వ్యవస్థ అస్తవ్యస్థం: డబ్ల్యూ.హెచ్.వో ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు మరోసారి విజృంభిస్తే వైద్యవ్యవస్థలు దారుణ స్థితిలోకి వెళ్లిపోతాయని డబ్ల్యూ.హెచ్.వో ఆందోళన వ్యక్తం చేసింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 11 శాతం కేసులు పెరిగాయని తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్ లలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఇది ఇలాగే కొనసాగితే కేసుల సునామీకి దారితీస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యవ్యవస్థ అతలాకుతలం అవుతుందన్నారు.