Begin typing your search above and press return to search.

పదేళ్ల బాలుడికి సర్జరీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   12 Jan 2023 6:30 AM GMT
పదేళ్ల బాలుడికి సర్జరీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
X
అత్యున్నత స్థానాల్లో ఉండి కూడా తమ మూలాల్ని మర్చిపోకుండా వ్యవహరించే అధినేతలు కొందరు ఉంటారు. దివంగత మహానేత.. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే.. విపక్ష నేతగా ఉన్న వేళలోనూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన చదువుకున్న డాక్టర్ చదువు పలువురికి మేలు చేసింది. ఆ మాటకు వస్తే.. ఆరోగ్య శ్రీ పథకం వెనుక ఆరోగ్య సేవలు సామాన్యులకు ఎంత ముఖ్యమన్న విషయం తెలిసినందువల్లే దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.

తాజాగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అధినేత.. పదేళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేయటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఊపిరి సలపవనంత బిజీ షెడ్యూల్ తో ఉండే ఆయన.. సీఎం కాక ముందు వరకు చేసిన వైద్య వ్రత్తిని కొనసాగించటం విశేషం. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా. ఏడు నెలల క్రితం త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన డాక్టర్ ప్రాక్టీస్ కు దూరంగా ఉంటున్నారు.

గతంలో ఆయన హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పని చేసేవారు. తాజాగా ఆ క్యాంపస్ కు అడుగు పెట్టిన వేళలో.. పదేళ్ల బాలుడికి డెంటల్ సర్జరీ చేయాల్సి రావటంతో ఆయన ఆ సర్జరీ చేశారు. ముఖ్యమంత్రి వెంట డాక్టర్ అమిత్ లాల్ గోస్వామి.. మరికొందరు డాక్టర్ల నేత్రత్వంలో ఆయన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత సర్జరీ చేయటం.. అది కాస్తా విజయవంతం కావటంపై ముఖ్యమంత్రి తన ఆనందాన్ని వ్యక్తంచేశారు.

త్రిపురలో పాతుకుపోయిన వామపక్షాలను 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన బీజేపీ అధికారాన్నిచేపట్టింది. బిప్లవ్ దేవ్ ఇటీవల కాలం వరకు సీఎంగా వ్యవహరించినా.. ఏడు నెలల క్రితం ఆయన్ను తప్పించిన బీజేపీ అధినాయకత్వం మాణిక్ సాహును సీఎంగా చేసింది.

మరికొద్ది నెలల్లో రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే వేళలో.. సీఎం స్వయంగా సర్జరీ చేయటం ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. తన పాత ప్రాక్టీస్ ను మర్చిపోకుండా.. సీఎం స్థాయిలో ఉండి కూడా సర్జరీ చేయటం విశేషంగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.