Begin typing your search above and press return to search.

భారత బాలికకు బ్రిటన్ లో చేదు అనుభవం

By:  Tupaki Desk   |   11 Aug 2019 4:48 AM GMT
భారత బాలికకు బ్రిటన్ లో చేదు అనుభవం
X
ప్రపంచమంతా ఇప్పుడు జాతీయవాదం పెచ్చరిల్లిపోతోంది. వేరే దేశస్థులపై వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా విదేశీయులను తరిమికొట్టే చట్టాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇక బ్రిటన్ లోనూ ఇతర దేశస్థులను ఓర్వలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఉపాధి కోసం.. ఉద్యోగాల కోసం బ్రిటన్ లో వెళ్లి స్థిరపడ్డ భారతీయులకు ఇప్పుడు ఇవే అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ భారతీయ సిక్కు బాలిక మున్సిమన్ కౌర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిక్కు కావడంతో మతాచారం ప్రకారం తలకు తలపాగా చుట్టుకుంది. ఓ పార్క్ కు వెళ్లిన పదేళ్ల భారతీయ చిన్నారి మున్సిమన్ కౌర్ ని బ్రిటన్ పిల్లలు చీదరించారు. ‘నువ్వు ఉగ్రవాది’ అంటూ తమతో కలవనీయకుండా దూరం పెట్టి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. పెద్దవాళ్లలోనే కనిపించిన ఈ జాఢ్యం ఇప్పుడు పదేళ్ల చిన్నారుల్లోనూ ప్రస్ఫుటించడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది..

ఇక బ్రిటన్ పిల్లలు ఉగ్రవాది అంటూ తిట్టడంతో ఆ పదేళ్ల చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తండ్రి ఆరాతీయగా విషయం చెప్పింది. ఆయన చిన్నారికి బ్రిటన్ లో జరిగిన అవమానంపై వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది.

వీడియోలో మున్సిమన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కులు సహజంగానే ఉంటారని..వారు ఉగ్రవాదులు కాదని.. వారు అందరికీ ప్రేమను పంచుతారని పేర్కొంది. ఇలాంటి జాత్యహంకారాన్ని ప్రతీ తల్లిదండ్రి ఖండించాలని.. పిల్లలకు నూరిపోయవద్దని పేర్కొంది. కాగా ఆమె ధైర్యంగా వీడియోలో ఇలా పిలుపునివ్వడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి