Begin typing your search above and press return to search.

బీహార్‌ లో 100 మంది క్రిమిన‌ల్ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   10 Nov 2015 9:14 AM GMT
బీహార్‌ లో 100 మంది క్రిమిన‌ల్ ఎమ్మెల్యేలు
X
బీహార్ ఎన్నిక‌లు...దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ ఓడిపోయి మ‌హాకూట‌మి గెలిచింది. ఈఎన్నిక‌ల సంద‌ర్భంగా బాగా పాపుల‌ర్ అయిన డైలాగ్‌ లు ఏంటంటే.... బీహారీ-బాహ‌రీ - జంగిల్‌ రాజ్‌. మ‌హాకూట‌మిని గెలిపిస్తే జంగిల్ రాజ్ రాజ్యం వ‌స్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్ర‌క‌టించారు. బీహారీల‌కు ఓటువేస్తారో బాహ‌రీ(బ‌య‌టి వారికి) ఓటువేస్తారో నిర్ణ‌యించుకోవాలంటూ నితీశ్ కోరారు. అయితే ఇపుడు బీహార్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి కాబ‌ట్టి ఆ విష‌యం వ‌దిలేయ‌చ్చు. అయితే ఫ‌లితం తేలిపోయినా బీహార్‌ లో గెలిచిన వారి చిట్టా చూస్తే విస్మ‌యక‌రంగా ఉంది. ఎమ్మెల్యేల్లో నేర‌చ‌రిత ఉన్న వారి లెక్క‌లు చూస్తే దిమ్మ తిరిగిపోతోంది.

ఈ ఎన్నిక‌ల్లో దాదాపు 1000 మందికి పైగా అభ్య‌ర్థులు తీవ్ర నేర‌చ‌రిత క‌లిగి ఉండి బ‌రిలో దిగారు. వీరిలో నితీశ్ నేతృత్వంలోని మ‌హాకూట‌మి త‌ర‌ఫున 142 మంది బ‌రిలో దిగ‌గా 100 మంది గెలుపొందారు. మోడీ సార‌థ్యం వ‌హించిన ఎన్డీఏ త‌ర‌ఫున 139 మంది బ‌రిలో దిగ‌గా....37 మంది గెలుపొందారు. మొత్తంగా గెలుపొందిన వారిలో దాదాపు 60శాతం అభ్య‌ర్థులు నేర‌చ‌రిత్ర క‌లిగి ఉన్న వారేన‌ని అధికారులు చెప్తున్నారు. మ‌దిహా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జేడీయూ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థి న‌రేంద్ర కుమార్ సింగ్‌ 15 క్రిమిన‌ల్ కేసుల‌తో టాప్‌ లో నిలిచారు. బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న మ‌హ‌మ‌ద్ ఇలాయ‌స్ అనే అభ్య‌ర్థి కేసుల్లో రెండో స్థానంలో నిలిచారు. డెహ్రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన ఈయ‌న‌పై 14 కేసులు న‌మోదై ఉన్నాయి.

నేర‌చ‌రిత్రుల జాబితా చూస్తూ ఉంటే... బీహార్‌ లో ముందున్న‌ది జంగిల్ రాజ్య‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.