Begin typing your search above and press return to search.

టీడీపీ దాదాపు వంద మంది కొత్త ఇన్ ఛార్జ్ ల ను తీసుకుని వస్తుందా?

By:  Tupaki Desk   |   19 May 2021 11:30 AM GMT
టీడీపీ దాదాపు వంద మంది కొత్త ఇన్ ఛార్జ్ ల ను తీసుకుని వస్తుందా?
X
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్ప‌ట్లో పుంజుకుంటుందా ? ఆ పార్టీని నేత‌లు న‌మ్మ‌డం లేదా ? నేత‌ల‌ను ఆ పార్టీయే న‌మ్మ‌డం లేదా ? అస‌లు ఏం జ‌రుగుతుందో ? కూడా అర్థం కాని ప‌రిస్థితి. కార్పొరేష‌న్‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసుకుని పార్టీని బైబై చెప్పేద్దామ‌ని చాలా మంది నేత‌లు ఎదురు చూశారు. అయితే ఇంత‌లో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండ‌డంతో రాజ‌కీయంగా ఎవ్వ‌రూ యాక్టివ్‌గా లేక‌పోవ‌డం.. ఇప్ప‌ట్లో పార్టీ మారినా ప‌ట్టించుకునే వాళ్లు లేక‌పోవ‌డంతో టీడీపీ నేత‌లు ఎవ‌రికి వారు గ‌ప్‌చుప్‌గా ఉంటున్నారు. వాస్త‌వంగా చూస్తే ఏపీలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 80 నుంచి 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బ‌ల‌హీన‌మైన నాయ‌క‌త్వ స‌మ‌స్య‌తో కొట్టుమిట్టాడుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ధ‌ర్మ‌వ‌రం, రామ‌చంద్రాపురం, కొవ్వూరు, విజ‌య‌వాడ ప‌శ్చిమం, మాచ‌ర్ల‌, ప్ర‌త్తిపాడు, టి.గ‌న్న‌వ‌రం, పత్తిపాడు (గుంటూరు జిల్లా), సూళ్లూరుపేట ఇలా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించే నాథుడు లేడు.

చివ‌ర‌కు పార్టీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలోనూ గ‌న్న‌వ‌రం, నూజివీడు లాంటి చోట్ల నాయ‌కులు లేక‌పోవ‌డ‌మో బ‌ల‌హీన నాయ‌కులతో మమః అనిపించేయ‌డ‌మో జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌శాంత్ కిషోర్ స్ట్రాట‌జీతో తిరుగులేని విజ‌యం సాధించింది. ఇప్పుడు చంద్ర‌బాబు సైతం త‌న‌కూ స్ట్రాట‌జిస్ట్ లేక‌పోతే ప‌న‌వ్వ‌దు అనుకున్నారో లేదా వ‌చ్చే ఎన్నిక‌లే త‌న జీవితానికి చివ‌రివి అనుకున్నారో కాని ఆయ‌న కూడా రాబిన్ శ‌ర్మ అనే స్ట్రాట‌జిస్ట్‌ను నియ‌మించుకున్నారు. గ‌తంలో పీకే టీంలో ఏపీ ఎన్నిక‌ల కోసం ప‌నిచేసిన రాబిన్ శ‌ర్మ ఇప్పుడు బ‌య‌టకు వ‌చ్చేశారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌కు ముందు అక్క‌డ హ‌డావిడి చేసిన శ‌ర్మ త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు. అయితే ఆయ‌న ఏపీలో 25 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించుకుని పార్టీలో ఎవ‌రు ఏం చేస్తున్నారో ? కూపీ అయితే లాగుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాబిన్ శ‌ర్మ పార్టీలో భారీ ఎత్తున ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలిన‌.. దాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడున్న వారిని తీసేసి కొత్త వారికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబుకు ప్రాధ‌మికంగా నివేదించిన‌ట్టు స‌మాచారం. టీడీపీకి సంస్థాగ‌తంగా తిరుగులేని బ‌లం ఉంద‌ని.. అయితే సీనియ‌ర్లు, అవుట్ డేటెడ్ నాయ‌కులు, ప్ర‌జ‌ల్లో ప‌ట్టులేని వారిని ఇంకా నెట్టుకురావ‌డంతో ఉప‌యోగం లేద‌ని శ‌ర్మ నివేదిక చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఇప్పుడే వారి స్థానంలో కొత్త వారికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే పార్టీకి జ‌వ‌స‌త్వాలు వ‌స్తాయ‌ని కూడా బాబుకు చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు వీరిని మారిస్తే.. పాత‌, సీనియ‌ర్ నేత‌లు పార్టీని డిస్ట‌ర్బ్ చేస్తార‌ని.. ఇప్పుడే వారిని ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల నాటికి కొత్త నేతలు దూసుకుపోయే ఛాన్స్ ఉంటుంద‌ని శ‌ర్మ & టీం భావిస్తోంద‌ట‌.

జ‌గ‌న్ సైతం గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముక్కూ మొఖం తెలియ‌ని వారిని నాయ‌కుల‌ను చేసి టిక్కెట్లు ఇవ్వ‌డంతో పాటు వారు ఎమ్మెల్యేలు అయ్యారు. వైసీపీ నుంచి గెలిచిన 151 మందిలో ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు కొత్త వారు అంటేనే జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఎలా వ‌ర్క‌వుట్ అయ్యిందో తెలుస్తోంది. ఇప్పుడు రాబిన్ శ‌ర్మ సైతం గురువు పీకే బాట‌లోనే వెళుతున్న ప‌రిస్థితి. ఇక సీనియ‌ర్ నేత‌ల‌ను ఎన్నిక‌ల ముందే త‌ప్పిస్తే ఇటు లోకేష్ నాయ‌క‌త్వాన్ని సైతం ఎదిరిస్తే అనేక ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. అదే ఇప్పుడు వారిని ప‌క్క‌న పెట్టినా ఎన్నిక‌ల నాటికి కొత్త నేత‌ల‌తో ఈ సెగ‌లు చ‌ల్లారిపోతాయ‌ని బాబుకు శ‌ర్మ స‌ల‌హాగా ఇచ్చార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం శ‌ర్మ టీం చేస్తోన్న స‌ర్వే పూర్తి అయిన వెంట‌నే టీడీపీలో భారీ ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌ద‌ని అంటున్నారు. దాదాపు 100 మంది కొత్త ఇన్‌చార్జ్‌లు అంటే టీడీపీ అధినేత‌కు పాత‌, సీనియ‌ర్ నేత‌ల నుంచి పెను స‌వాళ్లు ఎదురు కాక‌త‌ప్ప‌దు.. మ‌రి ఈ కొత్త నిర్ణ‌యాలు పార్టీని ఎంత వ‌ర‌కు నిల‌బెడ‌తాయో ? చూడాలి.