Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఒక మార్కెట్..14 గంటల్లో 100 టన్నుల చేపల్నికొనేశారు!

By:  Tupaki Desk   |   8 Jun 2020 10:50 AM GMT
హైదరాబాద్ లో ఒక మార్కెట్..14 గంటల్లో 100 టన్నుల చేపల్నికొనేశారు!
X
హైదరాబాద్ మహానగరం మీద కాస్తంత పరిచయం ఉన్న వారు ఎవరైనా సరే.. ముషీరాబాద్ చేపల మార్కెట్ మీద అంతో ఇంతో అవగాహన ఉంటుంది. భారీగా ఉండే ఈ మార్కెట్ విడిరోజుల కంటే వారాంతంలో మహా రద్దీగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో రద్దీ అంతంత మాత్రంగా ఉండేది. అలాంటిది ఆదివారం ఈ మార్కెట్లో చేపల కోసం పోటెత్తిన జనాల్ని చూసినోళ్లంతా నోరెళ్లపెడుతున్నారు.

మృగశిర కార్తె నేపథ్యంలో చేపల్ని కొనేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది. వేలాదిగా వచ్చిన ప్రజలతో మార్కెట్ కోలాహలంగా మారి పోయింది. మాయదారి రోగం ఉందన్న విషయాన్ని చేపల రందిలో పడి మర్చిపోయినోళ్లు చాలామందే ఉన్నారు. శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి వంద టన్నుల (టన్ను అంటే వెయ్యి కిలోలు. మొత్తంగా లక్ష కేజీలు) చేపల్ని అమ్మేసినట్లుగా చెబుతున్నారు. ఇంత భారీగా చేపలు అమ్మేందుకు వచ్చిన రద్దీపై ఆందోళన ఎక్కువ అవుతోంది.

ఓవైపు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. అలాంటి టెన్షన్ లేకుండా.. చేపలు కొనేందుకు వస్తున్న పబ్లిక్ ను చూసి వ్యాపారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం ప్రమాదంతో ఆటలు ఆడుకోవటమేనన్న మాట వినిపిస్తోంది. ఆదివారం అమ్మకాల్లో కొర్రమీను కిలో రూ.600 చొప్పున అమ్మారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో సాధారణ ధరలతో పోలిస్తే మామూలు చేపల ధరలు కేజీ రూ.20 నుంచి రూ.50 ఎక్కువగా అమ్మినట్లుగా తెలుస్తోంది.