Begin typing your search above and press return to search.

వందేళ్ల వారి జీవనం.. గంట తేడాతో వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   14 Nov 2019 8:42 AM GMT
వందేళ్ల వారి జీవనం.. గంట తేడాతో వెళ్లిపోయారు
X
భార్యను చంపే భర్త.. కట్టుకున్న మొగుడ్ని తాత్కాలిక సుఖం కోసం ప్లాన్ చేసి మరీ చంపే భార్య.. ఇలాంటి ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తూ.. బంధాలకు.. అనుబంధాలకు కొత్త మరకల్ని అంటిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిన్న చిన్న కారణాలతో జీవితంలో ఎవరి స్పేస్ వారికి ఉండాలన్న ఉద్దేశంతో విడిపోయి బతికే జంటలు బోలెడన్ని కనిపిస్తాయి.

వైవాహిక బంధంలో ఇచ్చిపుచ్చుకోవటం తప్పనిసరన్న విషయాన్ని మర్చిపోతున్న నేటి తరానికి తాజాగా చెప్పే ఉదంతం కాస్త కొత్తగానే కాదు.. ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఎక్కువ. నూరేళ్లకు పైనే కలిసి జీవించిన వారు కేవలం గంట తేడాతో వెళ్లిపోయిన వైనం.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారి కళ్లు చెమర్చేలా చేస్తోంది.

తమిళనాడులోని కుప్పకూడి గ్రామానికి చెందిన వెట్రివేల్ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే వెట్రివేల్ కు 104 ఏళ్లు. ఆయన భార్య పిచాయ్ కు వందేళ్లు. వీరిద్దరి వైవాహిక జీవితం 75 ఏళ్లకు పైనే. వీరికి ఐదుగురు కొడుకులు.. ఒక కుమార్తె. వీరందరికి పెళ్లిళ్లు కావటమే కాదు.. వారి పిల్లలతో కలిసి మొత్తంగా ఆ జంటకు 23 మంది మనవళ్లు.. మనవరాళ్లు.. మునిమనమలు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీరంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండటం.

వందేళ్లకు పైబడినప్పటికీ పెద్దగా ఆరోగ్య సమస్యలు లేని వెట్రివేల్ తాజాగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. భర్త చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న భార్య పిచాయ్.. భర్త భౌతికకాయం ముందు ఏడుస్తూ మూర్ఛపోయింది. వైద్యుల్ని పిలపించగా.. ఆమె కూడా మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. 75 ఏళ్లకు మించిన వైవాహిక జీవితంలో కలిసి బతికిన తోడు లేడన్న గంటకే తుదిశ్వాస విడవటంతో ఆ కుటుంబంలోనే కాదు.. ఆ గ్రామంలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి. ఇలాంటి బంధాలు నేటి డిజిటల్ ప్రపంచంలో ఊహించగలమా?