Begin typing your search above and press return to search.
మీకు తెలుసా? :ఈ నోటు పుట్టి వందేళ్లు!
By: Tupaki Desk | 30 Nov 2017 7:21 AM GMTకొన్ని విషయాలు చూడ్డానికి సింపుల్ గా ఉన్నా లోతుల్లోకి వెళ్తే.. చాలా ఆసక్తికర స్టోరీ ఉంటుంది. అలాంటి వింతైన స్టోరీయే రూపాయి కథ! ప్రస్తుతం పెద్దగా చలామణిలో లేదని అనుకున్నా.. రూపాయి బిళ్లల రూపంలో నిత్యం మన చేతుల్లో తిరుగాడుతూనే ఉన్నాయి. అయితే, నోటు రూపంలో రూపాయికి ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా గత ఏడాది నోట్ల రద్దు సమయంలో రూపాయి నోట్లకు కూడా గిరాకీ పెరిగిపోయింది. ఇక, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రూపాయికి వాల్యూ తరగిపోలేదు. 1917 నవంబరు 30న ప్రవేశపెట్టిన ఈ రూపాయి నోటుకు నేటితో(2017 నవంబరు 30) వందేళ్లు నిండాయి. తొలిసారి ఈ నోటును కింగ్ జార్జ్ వీ ఫోటోతో ఇంగ్లాండ్ దేశం భారత్ లో ప్రవేశపెట్టింది. నాటి నుంచి వర్తకులు ఈ నోటునే తమ అవసరాలకు విరివిగా వినియోగించారు.
అనంతరం 1935 ఏప్రిల్ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు భారత రిజర్వ్ బ్యాంక్ కు అప్పటి బ్రిటీష్ పాలకులు అనుమతించారు. 1861 నుంచే కరెన్సీ నోట్ల జారీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతున్నప్పటికీ - 1917లోనే రూపాయి నోటును ప్రవేశపెట్టారు. ఒకటో ప్రపంచ యుద్ధంలో ఆయుధాలను తయారు చేసేందుకు రూ.1 కాయిన్లను వాడటంతో - ఈ నోటు ప్రవేశం జరిగింది. 1917లో లాంచ్ చేసిన ఈ నోటు - 10.7 గ్రాముల వెండికి సమానంగా ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390గా ఉంది. అంటే రూపాయి నోటు విలువ దాదాపు 400 వంతు తగ్గిపోయింది.
1994లో నిలిపివేసిన రూపాయి నోటు ముద్రణను 2015 మార్చి 6న పునరుద్ధరించారు. రూపాయి నోటు ముద్రించేందుకు రూ.1.14 ఖర్చవుతున్నట్టు సమాచార హక్కుచట్టంలో వెల్లడైంది.1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్ కే మీనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం ముద్రించారు. 1951లో హిందీలో ముద్రించిన రూపాయి నోటు కూడా విడుదలైంది. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇటీవల కాలంలో చాలా మంది రూ.1 నోట్లను వాడుతున్నారట. ఇదిలావుంటే, వందేళ్లు పూర్తిచేసుకున్న రూ.1 నోటుపై మాత్రం రిజిర్వు బ్యాంకు ఎలాంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం.