Begin typing your search above and press return to search.

కరోనాను జయించి ఆసుపత్రిలో 101వ బర్త్ డే చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   15 July 2020 10:00 AM IST
కరోనాను జయించి ఆసుపత్రిలో 101వ బర్త్ డే చేసుకున్నాడు
X
విలయతాండవం చేస్తూ.. చిన్న పెద్దా అన్న తేడా లేకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ 5.78లక్షల మంది మరణించారు. లక్షలాది కుటుంబాలు బాధితులుగా మారాయి. చిన్న వయసులో ఉన్న వారి మొదలు పెద్ద వయస్కుల వరకూ మరణించిన వారిలో ఉన్నారు. ఇలాంటివేళ.. వందేళ్లు దాటిన పెద్దమనిషి ఒకరు కరోనాను జయించటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ముంబయిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ముంబయిలోని హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ థాక్రే ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. వందేళ్లు పైబడిన అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ అనే పెద్ద వయస్కుడు ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరాడు. అతన్ని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు. మొత్తానికి వైద్యుల శ్రమతో పాటు.. సమ్రాట్ ఆత్మస్థైర్యం ఆయన్ను బతికేలా చేసింది.

కరోనాను జయించిన ఈ శతాధిక వృద్ధుడ్ని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే.. అదే రోజున ఆయన 101వ పుట్టిన రోజు కలిసి రావటంతో వైద్యులంతా కలిసి చిన్నసైజు బర్త్ డే పార్టీని ఆసుపత్రిలో నిర్వహించారు. వైద్యులే స్వయంగా ఆయన చేత కేకు కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చిన్న వయసులోనే కరోనా ధాటికి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్న వేళ.. వందేళ్లకు పైబడిన పెద్ద వయస్కుడు కరోనాను జయించి.. విజయవంతంగా ఇంటికి వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.