Begin typing your search above and press return to search.

బ్రిటీష్ పాశవిక చర్య... జలియన్ వాలా బాగ్ మారణకాండకు 102 ఏళ్లు!

By:  Tupaki Desk   |   13 April 2021 12:30 PM GMT
బ్రిటీష్ పాశవిక చర్య... జలియన్ వాలా బాగ్ మారణకాండకు 102 ఏళ్లు!
X
భారత స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత విషాద దినం ఏప్రిల్ 13. బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన అత్యంత పాశవిక చర్య జలియన్ వాలా మారణకాండ. పంజాబ్ లోని స్వర్ణదేవాలయం సమీపంలో ఉన్న జలియన్ వాలా బాగ్ లో 1919 ఏప్రిల్ 13న ఈ దుర్ఘటన జరిగింది. నేటికి ఈ విషాద ఘటనకు 102 ఏళ్లు పూర్తయింది.

మారణకాండకు నేపథ్యం
1919లో బ్రిటీషు ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చింది. అనగా భారతీయులపై విచారణ జరపకుండా శిక్షించే అధికారాన్ని కట్టబెట్టింది. దీనిపై దేశవ్యప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో సత్యపాల్, సైపూద్దీన్ కిచ్లూను అరెస్ట్ చేశారు. వారిని నిర్బంధించడపై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అరెస్ట్ ను నిరసిస్తూ హర్తాళ్ చేశారు. ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరపగా దాదాపు 20 మంది మృత్యవాత పడ్డారు.

కారణాలు
ఈ పోలీసుల చర్యల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో 1919 ఏప్రిల్ 13న భారీ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అయితే పంజాబ్ ప్రభుత్వం ఆ సమావేశాలపై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే శాంతియుతంగా సమావేశం జరుగుతుండగా బ్రిటీషు తూటాలు విజృంభించాయి. ప్రజలంతా గుమిగూడి ఉన్న సమయంలో పది నిమిషాల పాటు కాల్పుల వర్షం కురింపించారు. దాదాపు 1650 రౌండ్లు కాల్పులు జరిపినట్లు బ్రిటీషు అధికారులు ధ్రువీకరించారు.

మారణహోమం
ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 370 మందికి మృతి చెందారని బ్రిటీషు ప్రభుత్వం తెలిపింది. 1200 మంది గాయపడ్డారని ప్రకటించింది. కానీ నిజానికి వెయ్యి మంది మృత్యువాత పడ్డారని మరో రెండు వేల మంది తీవ్రంగా గాయపడ్డారని అంచనా వేశారు. ఈ ఘటనతో భారతీయుల్లో స్వాతంత్ర్య కోరిక తార స్థాయికి చేరింది. యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి ఈ ఘటనే కారణమని కొందరు చెబుతారు.

చరిత్రలోనే విషాద ఘటన
ఈ దురంతం కారణంగా బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిన సర్ బిరుదును రవీంద్ర నాథ్ ఠాగూర్ తిరిగి ఇచ్చేశారు. ఇలా దేశవ్యాప్తంగా స్వదేశంపై మమకారం పెరిగింది. 1947 వరకు సాగిన స్వాతంత్ర్య సమరంలో ఈ దురంతం అతిపెద్ద విషాద దినంగా మిగిలిపోయింది. ఈ ఘటనకు గుర్తుగా 1961 ఏప్రిల్ 13న జవహర్ లాల్ నెహ్రు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. బుల్లెట్ వర్షాల నుంచి తప్పించుకోవడానికి కొందరు బావిలో దూకారని... బావిలో 120 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆ స్తూపంపై ప్రస్తావించారు. ఈ పాశవిక చర్యకు కారణమైన జనరల్ జయ్యర్ హత్యకు గురయ్యారు. ఈ విషాద ఘటన జరిగి 102 ఏళ్లైంది.