Begin typing your search above and press return to search.

ఓయూ సాక్షిగా..కేసీఆర్ ప‌రువు మ‌ళ్లీ పోయింది

By:  Tupaki Desk   |   21 Dec 2017 7:16 AM GMT
ఓయూ సాక్షిగా..కేసీఆర్ ప‌రువు మ‌ళ్లీ పోయింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌తిష్టాత్మక ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్‌ ను తెలంగాణ‌లో నిర్వ‌హించ‌లేమ‌ని నిర్వాహ‌కులు తేల్చిచెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఐఎస్‌సీని నిర్వహించలేమని వీసీ తెలిపారని అందుకే తాము ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ను నిర్వహించలేమని చెప్పినట్లు సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ పరిణామం తెలంగాణ స‌ర్కారుకు ముఖ్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు గ‌ట్టి ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.

ప్రతిష్టాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3నుంచి 7వరకు జ‌ర‌గాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. 3వ తేదీన సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకావాల్సి ఉంది. వివిధ రంగాల నుంచి మేధావులు - శాస్త్రవేత్తలు - పరిశోధకులు పెద్ద ఎత్తున ఈ సమావేశాలకు హాజరవడంతో పాటు ఇందులో భాగంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలలో పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు పాల్గొని ప్రసంగించడం షెడ్యూల్‌ లో ఉంది. అయితే ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనల నేపథ్యంలో ఈ కాంగ్రెస్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు అలుముకున్నాయి. ఈ క్ర‌మంలో తొలుత వేదిక మార్పునకు ప్రయత్నించారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఐఎస్‌ సీని నిరవధికంగా వాయిదా వేశారు.

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న సంద‌ర్భాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్ల విడుద‌ల‌లో జాప్యం - ఉద్యోగాల భ‌ర్తీలో స‌ర్కారు తీరును నిర‌సిస్తూ పెద్ద ఎత్తున్నే ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. కొద్దికాలం కింద‌ట జ‌రిగిన ఉస్మానియా శ‌తాబ్ధి ఉత్స‌వాల సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వగా...అప్పుడు కూడా నిర‌స‌న తెలిపేందుకు ఓయూ విద్యార్థులు ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఓయూలో కేసీఆర్‌ కు వ్య‌తిరేక వాతావ‌ర‌ణం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దానికి కొన‌సాగింపుగా అనంత‌రం కొన్ని నిర‌స‌న‌లు సాగాయి. ఇటీవ‌ల విద్యార్థి ముర‌ళి ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ఓయూ భ‌గ్గుమంది. ఈ నేప‌థ్యంలో ఓయూలో ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేసిన సంబంధిత వ‌ర్గాలు తాము పూర్తి స్థాయిలో సంసిద్దంగా లేమని పేర్కొంటూ ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...ఈ సమావేశాల్లో భాగంగా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వహించేందుకు ఓయూలో సిద్ధ‌మ‌య్యారు. వేదిక‌ల‌ను ఖ‌రారు కూడా చేశారు. చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ ను ఓయూ టెక్నాలజీ కళాశాలలో - ఉమెన్స్ సైన్స్ కాంగ్రెస్‌ ను ఠాగూర్ ఆడిటోరియంలో - సైన్స్ ఎగ్జిబిషన్‌ ను సీ గ్రౌండ్‌ లో - సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్‌ ను మెయిన్ లైబ్రెరీ బిల్డింగ్‌ లోని ఐసీఎస్‌ ఎస్‌ ఆర్ సెమినార్ హాల్‌ లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశాలు నిర్వహించే వేదికలపై కూడా అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సమావేశాల ప్రారంభోత్సవ వేదికను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో వేదిక ఖరారుపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ వేదికను ఖరారు చేయడంలో ప్రభుత్వం పాత్ర కూడా ఉన్న దరిమిలా జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మొత్తం 12,969 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని స‌మాచారం. ఇలా ఓ వైపు ఏర్పాట్లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే మ‌రోవైపు వాయిదా ప‌డటం గ‌మ‌నార్హం.