Begin typing your search above and press return to search.

వారెవ్వా .. కరోనాను జయించిన 106 ఏళ్ల బామ్మ ..!

By:  Tupaki Desk   |   16 April 2020 8:30 AM GMT
వారెవ్వా .. కరోనాను జయించిన 106 ఏళ్ల బామ్మ ..!
X
కరోనా వైరస్ .. మొత్తం ప్రపంచాన్నే ఇప్పుడు భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి. అయితే , ఈ తరుణంలో కూడా కొంతమంది వృద్దులు ఈ కరోనా ను జయించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటలీ, టర్కీలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోగా తాజాగా ఇంగ్లండ్‌లో 106 ఏళ్ల బామ్మ కరోనా పై విజయం సాధించారు. దీనితో బ్రిటన్‌ లో కరోనా నుంచి కోలుకున్న అత్యధిక వయస్సు గల మహిళగా నిలిచారు.

సెంట్రల్‌ ఇంగ్లండ్‌ కు చెందిన కోనీ టీచెన్‌ అనే 106 ఏళ్ల బామ్మ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో బర్మింగ్‌ హాం సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె, మూడు వారాల పాటు మహమ్మారితో పోరాడి కోలుకున్నారు. దీంతో కరతాళ ధ్వనుల మధ్య డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆమెను ఇంటికి పంపారు. దీనిపై ఆ బామ్మ స్పందిస్తూ ..ప్రాణాంతక వైరస్‌పై పోరులో విజయం సాధించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.

కోనీ మనుమరాలు అలెక్స్‌ జోన్స్‌ మాట్లాడుతూ.. తమ బామ్మ ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారని, తన పనులు తానే చేసుకుంటారని వెల్లడించారు. స్వయంగా వంట చేసుకుంటారని.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని , తన బామ్మ అద్భుతమైన వ్యక్తి అని.. తనకు ఉన్న మంచి అలవాట్ల వల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని కినీ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఆస్పత్రిలో కినీకి సేవలు అందించిన నర్సు సైతం ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.