Begin typing your search above and press return to search.

ఫెయిల్ అవుతాన‌న్న భ‌యంతో టెన్త్ కుర్రాడి సూసైడ్‌!

By:  Tupaki Desk   |   25 April 2019 7:03 AM GMT
ఫెయిల్ అవుతాన‌న్న భ‌యంతో టెన్త్ కుర్రాడి సూసైడ్‌!
X
పాస్.. ఫెయిల్.. రెండింటికి తేడా చాలానే ఉన్నా.. దాని వ‌ల్ల లాభం.. న‌ష్టం అంత ఎక్కువేమీ కాదు. జీవితంలో అన్ని పాస్ కావాల‌ని లేదు.. అప్పుడ‌ప్పుడు ఫెయిల్ త‌ప్ప‌నిస‌రి. కానీ.. ఎక్క‌డ ఫెయిల్ అవుతానేమోన‌న్న ముంద‌స్తు భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టానికి మించిన పిచ్చిత‌నం మ‌రొక‌టి ఉండ‌దు.

ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన వెంట‌నే ఏదో జ‌రిగిపోయిన‌ట్లుగా ఆలోచ‌న‌లు చేయ‌టం స‌రైన‌ది కాదు. అన్నింటికి ప్రాణం తీసుకోవ‌ట‌మే ప‌రిష్కారం భావించ‌టం కూడా మంచిది కాదు. ఇలాంటి తీరును అంద‌రూ త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ఖండించాల్సిన అవ‌స‌రం ఉంది.

జీవితాన్ని ముగించేంత పెద్ద న‌ష్టం.. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ తోనే జ‌ర‌గ‌ద‌న్న నిజాన్ని త‌ల్లిదండ్రులు గుర్తించ‌ట‌మే కాదు.. పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో వ‌చ్చే క‌మ్యునికేష‌న్ గ్యాప్ విలువ ఒక ప్రాణ‌మైతే.. అలాంటి గ్యాప్ ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూడ్చాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా మార్కుల లిస్టు లో చోటు చేసుకున్న త‌ప్పుల కార‌ణంగా.. తాము ఫెయిల్ అయ్యామ‌న్న అవ‌మాన భారంతో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్పుగూడ‌కు చెందిన కృష్ణాన‌గ‌ర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే న‌రేశ్ అనే బాలుడు టెన్త్ క్లాస్ మార్కులు త‌క్కువ వ‌స్తాయ‌ని.. ఫెయిల్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న భ‌యానికి గురైన‌ట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఇంట్లో ఎవ‌రూ లేని వేళ చూసుకొని ఫ్యాన్ కు ఊరేసుకొని మ‌ర‌ణించాడు. ప‌రీక్ష‌ల మీద ఉన్న భయంతోనే ఇలాంటి ప‌ని చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అయితే.. పిల్లాడి త‌ల్లిదండ్రులు మాత్రం త‌మ పిల్లాడు సూసైడ్ చేసుకోలేద‌ని చెబుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత‌దేహాన్ని గాంధీకి త‌ర‌లించారు.