Begin typing your search above and press return to search.

ఇంట‌ర్ ముగియ‌లేదు!..టెన్త్ ర‌చ్చ మొద‌లైందే!

By:  Tupaki Desk   |   27 April 2019 1:14 PM GMT
ఇంట‌ర్ ముగియ‌లేదు!..టెన్త్ ర‌చ్చ మొద‌లైందే!
X
తెలంగాణ‌లో ఇప్పుడు ర‌చ్చ ర‌చ్చ చోటుచేసుకుంటోంది. ఇంటర్ వాల్యూయేష‌న్ లో ఇంట‌ర్ బోర్డు - కాంట్రాక్టు సంస్థ గ్లోబ‌రీనాల నిర్ల‌క్ష్యంగా కార‌ణంగా పాస్ అవుతామ‌నుకున్న విద్యార్థులు ఫెయిలేతే... అత్తెస‌రు మార్కులొస్తాయ‌నుకున్న విద్యార్థుల‌కు ఏకంగా 90కి పైగా మార్కులు వ‌చ్చేశాయి. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ప‌లువురు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో త‌ప్పు త‌మదేనని ఇంట‌ర్ బోర్డు కార్యద‌ర్శి అశోక్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారం రోజులుగా ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం ముందు ర‌ణ‌రంగ‌మే చోటుచేసుకుంటోంది. చాలా ఆల‌స్యంగా మేల్కొన్న కేసీఆర్ స‌ర్కారు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు రంగంలోకి దిగింది.

ఫ‌లితంగా ఇంట‌ర్ వివాదం స‌ద్దుమ‌ణుగుతున్న స‌మ‌యంలో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న టెన్త్ ఫ‌లితాల‌పై ఇప్పుడు కొత్త ర‌చ్చ మొద‌లైంది. ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గి పబ్లిక్ ప‌రీక్ష‌ల వాల్యూయేష‌న్ జ‌రుగుతోంది. ఈ వాల్యూయేష‌న్ శుక్ర‌వారంతో ముగిసిపోయింది వాల్యూయేష‌న్ ముగిసిన నేప‌థ్యంలో... ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ బాంబు లాంటి వార్త టెన్త్ విద్యార్థుల‌తో పాటు వారి త‌ల్లిదండ్రుల‌నే కాకుండా యావ‌త్తు తెలంగాణ జ‌నాన్ని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

ఆ వార్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 15 నుంచి టెన్త్ వాల్యూయేష‌న్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని ఖాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌ కేంద్రంగానూ వాల్యుయేషన్‌ జరిగింది. ఈ కేంద్రంలో అనర్హులైన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా మూల్యాంకన విధులకు హాజరయ్యారు. ఈ విషయం కొన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా క్యాంపు అధికారి - వరంగల్‌ అర్బన్‌ డీఈవో కె.నారాయణ రెడ్డికి తెలిసింది. దీంతో ఆ ఇద్దరు ఉపాధ్యాయులను 20న మూల్యాంకన విధుల నుంచి తొలగించారు. రాష్ట్ర పరిశీలకులైన వరంగల్‌ ఆర్‌ జేడీ పి.రాజీవ్‌ అంతర్గత విచారణ చేపట్టి అనర్హులతో వాల్యుయేషన్‌ చేయించడం నిజమేనని గుర్తించారు.

అయితే అప్ప‌టికే వారు ఐదు రోజుల పాటు వాల్యూయేష‌న్ విధులకు హాజ‌ర‌య్యార‌ని - ఈ క్ర‌మంలో ఆ ఇద్ద‌రు 523 జవాబు పత్రాలు దిద్దారని తెలిసింది. వాటిని 12 మంది ఏఈలతో వాల్యూయేషన్‌ చివరి రోజు శుక్రవారం మళ్లీ ప్రత్యేకంగా దిద్దించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వార్త ఇప్పుడు తెలంగాణ‌లో పెను ఆందోళ‌న‌కు తెర తీసింద‌ని చెప్పాలి. ఒక్క ఖాజీపేటలోనే ఇలా జరుగుతుందా? లేక తెలంగాణ వ్యాప్తంగా ఇలా జరుగుతుందా? అనే కోణంలో ఇప్పుడు ఆందోళ‌న మొద‌లైపోయింది.