Begin typing your search above and press return to search.

11 బ్యాంకులు రద్దు చేసిన రుణాలు జస్ట్ రూ.2.75లక్షల కోట్లే

By:  Tupaki Desk   |   11 Oct 2019 6:38 AM GMT
11 బ్యాంకులు రద్దు చేసిన రుణాలు జస్ట్ రూ.2.75లక్షల కోట్లే
X
మీకో క్రెడిట్ కార్డు ఉంది. దాన్ని మీరు రెండేళ్లుగా వాడటం లేదు. అయినప్పటికీ వార్షిక నిర్వహణ కింద ఛార్జీల కింద డబ్బులు కట్టాలని నోట్ పంపారు. మీరు సరిగా చూడకకానీ.. మర్చిపోయి కానీ వదిలేస్తే.. కొంతకాలానికి అదో కొండలా మారటమే కాదు.. మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుంది.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలతో కూడిన సందేశాలు వస్తాయి. ఇదొక్కటే కాదు.. ఆ మాటకు వస్తే.. మీ పొదుపు ఖాతాలో తగినంత మొత్తాన్ని ఉంచని పక్షంలోనూ దానికి ఫైన్లు వేయటం.. ఆ తర్వాత మీరెప్పుడైనా ఆ అకౌంట్లో డబ్బులు వేస్తే.. నిర్మోహమాటంగా ఆ మొత్తాన్ని కట్ చేయటం తెలిసిందే.

సామాన్యుడికి సంబంధించి సేవలు అందిస్తున్న కారణంగా విధించే ఛార్జీల వసూళ్ల విషయంలోనే ఇంత కచ్ఛితంగా ఉంటే బ్యాంకులు వంద కోట్లు అప్పు ఇస్తే మరెంత కటువుగా ఉంటాయో అనుకోవటం మామూలే. కానీ.. అలాంటిదేమీ ఉండదు సరికదా. అంత భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్న బడాబాబుల రుణాల్ని రద్దు చేసేయటం బ్యాంకుల మరో కోణం. ఏదో ఒకటి అరా చేసి ఉంటారు.. అంత మాత్రానికే బుజ్జి బంగారం లాంటి బ్యాంకుల్ని అంతేసి మాటలు అనేస్తారా? మీ మీడియా బుద్ధి పోనిచ్చుకున్నారన్న భావన మీకేమైనా ఉంటే.. తాజా వివరాలు చదివితే అలాంటి ఆలోచనల్ని ఎగిరిపోవటం ఖాయం.

సమాచార హక్కు చట్టం కింద సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ సంచలన విషయాల్ని బయటకు వచ్చేలా చేసింది. దాదాపు పదకొండు ప్రముఖ బ్యాంకులు రూ.100 కోట్లు.. రూ.500 కోట్లు రుణాలు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించలేని కారణంగా రద్దు చేసిన వైనంతో హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోవటం ఖాయం. సామాన్యుల దగ్గర ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు.. ఇంత ఉదారత్వంతో వ్యవహరించటమా? అన్న సందేహం కలుగక మానదు.

తాజాగా వెల్లడైన సమాచారంలోని వాస్తవాలు షాకింగ్ గా మారటమే కాదు.. ఇలాంటి సౌకర్యాలు బడాబాబులకు మాత్రమే సాధ్యమేమో అన్న భావన కలగటం ఖాయం. బ్యాంకుల్లో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్ బీఐ తనకున్న మొండిబకాయిల్లో రూ.76,600 కోట్లను రద్దు చేసి పారేసింది. ఇందులో రూ.100 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న 220 మందికి చెందిన ఖాతాల్ని రికార్డుల్లో నుంచి పీకేసింది. అదే సమయంలో రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువగా రుణాలు ఉన్న 33 మందికి చెందిన ఖాతాలు కూడా ఉండటం గమనార్హం.

ఇలా రూ.100 కోట్లకు పైనే రుణాలు పెండింగ్ లో ఉండి.. వాటిని ఎంతకూ తిరిగి చెల్లించని రూ.2.75లక్షల కోట్ల మొండిబకాయిల్ని 11 బ్యాంకులు రద్దు చేసేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇలా మొండి బకాయిలు భారీగా ఉన్న బ్యాంకుల్లో ఎస్ బీఐ టాప్ ప్లేస్ లో నిలిచింది. 220 ఖాతాలకు చెందిన రూ.76,610 కోట్లు.. మరో 33 ఖాతాలకు చెందిన రూ.37,708 కో్ట్లను రద్దు చేసి పారేసింది. అదే రీతిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు 94 ఖాతాలకు సంబంధించి రూ.27, 024 కోట్లు (రూ.100 కోట్లకు పైనే ఉన్నవి) రద్దు చేయంగా.. ఇదేబ్యాంకు రూ.500 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉన్న 12 ఖాతాలకు సంబంధించి రూ.9,037 కోట్లను రద్దు చేసినట్లు పేర్కొంది.

ఐడీబీఐ బ్యాంకు కూడా తక్కువేం కాదు. 71 ఖాతాలకు సంబంధించి రూ.26,219 కోట్లను.. కెనరా బ్యాంకు 63 ఖాతాలకు సంబంధించి రూ.19,991 కోట్లను రద్దు చేసింది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉన్న 7 ఖాతాలకు సంబంధించి రూ.7,391 కోట్లను రైటాఫ్ చేసేయటం గమనార్హం. మరో ప్రభుత్వ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.100 కోట్లకు పైనే బకాయిలు ఉన్న 56 ఖాతాలకు సంబంధించి రూ.11,653 కోట్లను రద్దు చేయగా.. రూ.500 కోట్ల కంటే ఎక్కువగా మొండిబకాయిలున్న మూడు ఖాతాలకు సంబంధించి రూ.2,290 కోట్లను రద్దు చేసింది.

కార్పొరేషన్ బ్యాంక్ అయితే రూ.100 కోట్లకు పైనే బకాయిలు ఉన్న 50 ఖాతాలకు సంబంధించి రూ.11,083 కోట్లు.. రూ.500 కోట్లకు పైనే బాకీ ఉన్న రెండుఖాతాలకు సంబంధించిన రూ.1760 కోట్లను రద్దు చేసేసింది. బ్యాంక్ బరోడా రూ.10,308 కోట్లు (46 ఖాతాలకు సంబంధించి).. సెంట్రల్ బ్యాంక్ రూ.10,831 కోట్లు (45 ఖాతాలకు సంబంధించి) రద్దుచేసింది. ఇదే సెంట్రల్ బ్యాంకు రూ.500 కోట్లకు పైనే మొండి బకాయిలు ఉన్న నాలుగు ఖాతాలకు సంబంధించిన రూ.2794 కోట్లను రైటాఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మొండి బకాయిల్ని రద్దు చేయటంలో ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంకులు కూడా పోటీ పడుతున్నాయి. యాక్సిక్ బ్యాంకు 43 ఖాతాలకు సంబంధించి రూ.100 కోట్లకు పైనే మొండి బకాయిలు ఉన్న రూ.12,274 కోట్లను రద్దు చేయగా.. ఐసీఐసీఐ బ్యాంకు 37 ఖాతాలకు సంబందించి రూ.17,440కోట్లు (రూ.100 కోట్లకు పైనే మొండి బాకీలు) రద్దు చేసింది. ఐఓబీ బ్యాంక్ విషయానికి వస్తే రూ.100 కోట్లకు పైనే మొండి బకాయిలు ఉన్న 33 ఖాతాలకు సంబంధించి రూ.7,932 కోట్లను.. అదే విధంగా రూ.500 కోట్లకు పైనే బకాయిలు ఉన్న నాలుగు ఖాతాలకు సంబంధించి రూ.2521 కోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంత భారీ మొత్తం కోట్లాది మంది సామాన్య ప్రజలు చెల్లించే సేవల మొత్తం.. చిన్న చిన్న కారణాలతో వారి నుంచి వసూలు చేసే మొత్తమన్న విషయాన్ని మర్చిపోకూడదు.