Begin typing your search above and press return to search.

కలెక్టర్ల బదిలీ.. అమ్రపాలికి ట్విస్ట్ ఇదే..

By:  Tupaki Desk   |   29 Aug 2018 4:57 AM GMT
కలెక్టర్ల బదిలీ.. అమ్రపాలికి ట్విస్ట్ ఇదే..
X
కేసీఆర్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్న వేళ.. తనకు అనుకూలురైన అధికారులను పక్కనే పెట్టుకున్నాడు. కొరకరాని వారిని తనకు అడ్డుకాకుండా బదిలీలు చేపట్టారు. తాజాగా తెలంగాణలో కలెక్టర్ల బదిలీ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. స్ట్రిక్ట్ ఆఫీసర్లను లూప్ హోల్ పోస్టుకు.. చెప్పిన మాట వినే వారికి వారికి అనుకూలమైన పోస్టింగ్ ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న యోగితారాణా ఒత్తిళ్లకు లొంగడం లేదు. ఆమె గతంలో నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు కూడా ఇదే రకంగా ముక్కుసూటిగా వెళ్లేవారు. అధికార - ప్రతిపక్షాలనే తేడా లేకుండా నిక్కచ్చిగా వ్యవహరించేవారు. తాజాగా హైదరాబాద్ లోని భూ కబ్జాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ భూములను రికార్డుల్లోకి ఎక్కించారు. కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించారు. ఇటీవలే ఎంఐఎం నేతలతో కలెక్టర్ కు గొడవలు జరిగినట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఎంఐఎంతో స్నేహం.. తమ మాట వినడం లేదనే కారణంతోనే ఆమెను కుటుంబ సంక్షేమ శాఖకు బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఎన్నో సంస్కరణలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న రఘునందన్ రావుకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఆయన్ను హైదరాబాద్ కలెక్టర్ గా బదిలీ చేసింది.

ఇక వివాదాస్పద మాటలు - చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ప్రభుత్వానికి చిక్కులు తెస్తున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలికి ప్రభుత్వం షాకిచ్చింది.. ఆమె ఇటీవలే వరంగల్ కలెక్టర్ బంగ్లాలో దెయ్యాలున్నాయని.. తాను భయపడిపోతున్నానని చెప్పి దుమారం రేపింది. ఆమ్రాపాలి వ్యవహారశైలిపై ఆదినుంచి గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ నుంచి బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేసీఆర్ - హరీష్ - కేటీఆర్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట - రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను వ్యూహాత్మకంగా అటూ-ఇటూ మార్చేశారు. సిద్దిపేట కలెక్టర్ సిరిసిల్లకు.. సిరిసిల్ల కలెక్టర్ ను సిద్దిపేటకు మార్చి ఈ అనుకూల కలెక్టర్లకు ప్రభుత్వాధినేతలు అట్టిపెట్టుకోవడం విశేషం.