Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా కల్లోలం...11 మంది ఇండియన్స్ మృతి!

By:  Tupaki Desk   |   9 April 2020 7:10 AM GMT
అమెరికాలో కరోనా కల్లోలం...11 మంది ఇండియన్స్ మృతి!
X
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 205 దేశాలకు పాకింది. చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చినా.. అమెరికా - ఇటలీలలో మాత్రం కరోనా విళయతాండవం చేస్తుంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను కరోన వైరస్ అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇప్పటికే అమెరికా లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 4.35 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 14,795కు చేరుకుంది.

బుధవారం ఒక్కరోజే అమెరికాలో కరోనా కారణంగా దాదాపు 2 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఎఫెక్ట్‌ అమెరికాలో ఉంటున్న భార‌తీయులపై కూడా పడింది. అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణాలు నిలిచిపోవ‌డంతో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. ఇప్పటి వ‌ర‌కు 11మంది భార‌తీయులు క‌రోనాతో చ‌ని పోయిన‌ట్లు సమాచారం. వీరిలో 10 మంది న్యూయార్క్‌ - న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా - మరొకరు ఫ్లోరిడాకి చెందినవారు. మరో 16 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. కరోనాతో చనిపోయిన భారతీయులంతా పురుషులే.

కరోనా భారిన పడిన 16 మంది భారతీయులు స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. వీరంతా మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్‌ - ఉత్తరాఖండ్‌ - కర్ణాటక రాష్ట్రాలు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది న్యూయార్క్‌, ముగ్గురు న్యూజెర్సీ - మిగిలిన వారు టెక్సాస్ - కాలిఫోర్నియాకు చెందిన వారు ఉన్నారు. వీరికీ సహాయం అందజేయడానికి ఇండియన్ రాయబార కార్యాలయాల అధికారులు ముందుకొచ్చారు. స్థానిక అధికారులు, ఇండియన్-అమెరికన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికాలో కరోనా పంజా విసురుతుండటంతో కఠిన నియమాలు అమలులో ఉండడం వల్ల మరణించిన భారతీయుల అంత్య‌క్రియ‌ల‌ను స్థానిక అధికారులే చేప‌డుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం న్యూయార్క్‌ లోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా మరణాల సంఖ్యలో అమెరికా - స్పెయిన్‌ ను దాటేసింది.