Begin typing your search above and press return to search.

విన్నంతనే నమ్మలేరు కానీ నిజం.. విమాన చక్రాలపై 11 గంటల జర్నీ

By:  Tupaki Desk   |   25 Jan 2022 4:37 AM GMT
విన్నంతనే నమ్మలేరు కానీ నిజం.. విమాన చక్రాలపై 11 గంటల జర్నీ
X
ఆ మధ్యన ఒక బాలీవుడ్ మూవీ వచ్చింది. అందులో హీరో తన ప్రియురాల్ని కలుసుకునేందుకు పోలీసుల కళ్లు కప్పి విమానం చక్రాల నడుమ దాక్కొని ప్రయాణించే క్రమంలో మరణిస్తాడు. అసలు ఆ ఆలోచనే ఒళ్లంతా చల్లబడేలా చేస్తుంది. అలాంటిది ఏకంగా 11 గంటల పాటు విమాన చక్రాల మీద కూర్చొని ప్రయాణించటం.. బతికి బట్టకట్టటం అసాధ్యం. కానీ.. అది కాస్తా ఇతగాడి విషయంలో తప్పని తేలింది. తీవ్ర సంచలనంగా అంతకు మించి షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారంది. అసలేం జరిగిందంటే..

దక్షిణాఫ్రికాలోని జొహన్నె్‌సబర్గ్‌ నుంచి నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు జనవరి 23న.. ఓ సరుకు రవాణా విమానం ఒకటి బయలుదేరింది. ఈ బోయింగ్ 747 విమాన చక్రాల వద్ద ఒక వ్యక్తి అధికారుల కన్నుగప్పి చేరుకున్నాడు. చక్రాల పై భాగానికి చేరుకొని.. ఉండిపోయాడు. ఈ విమానం జొహన్నె్‌సబర్గ్‌ నుంచి తొలుత కెన్యా రాజధాని నైరోబీలో ఆగింది. అయితే.. అక్కడా అతడ్ని ఎవరూ గుర్తించలేదు.అనంతరంఅక్కడి నుంచి బయలుదేరిన విమానం ఏకబిగువున 11 గంటల పాటు ప్రయాణించి ఆమ్‌స్టర్‌డ్యామ్‌ చేరుకుంది.

ఈ ప్రయాణం ఎంత డేంజర్ అంటే.. సముద్ర మట్టానికి 35 వేల అడుగుల ఎత్తులో.. గంటకు885 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణించింది. ఈ ఎత్తులో ఉష్ణోగ్రతలు -54 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. అంతేకాదు.. గాలిలో ఆక్సిజన్ సైతం పాతిక శాతం తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అతడి శరీరం 11 గంటల పాటు తట్టుకోవటం అసాధారణమని చెబుతున్నారు.

విమానం అమ్ స్టర్ డ్యామ్ లో ల్యాండ్ అయ్యే సమయానికి సదరు వ్యక్తిని అధికారులు గుర్తించారు. ఆ వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులమినహా.. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. ఇంతటి ప్రతికూల వాతావరణంలో అంతసేపు ప్రయాణించి.. ప్రాణాలతో బయటపడటం అనూహ్యమని అంటున్నారు. ఇంతకూ అతడెవరు? ఎందుకీ పని చేశాడు? లాంటి విషయాలు బయటకురాలేదు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈ విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు