Begin typing your search above and press return to search.

11 నెలల చిన్నారి.. వైద్యానికి రూ.16 కోట్లు..! పేరెంట్స్ ఏం చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   30 May 2021 3:11 PM GMT
11 నెలల చిన్నారి.. వైద్యానికి రూ.16 కోట్లు..! పేరెంట్స్ ఏం చేశారో తెలుసా?
X
ఇవాళ రేపు.. మ‌నుషుల‌కు ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయో.. వాటిని త‌గ్గించ‌డానికి ఎంత ఖ‌ర్చు చేయాలో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. పూణెకు చెందిన వేదికా షిండే అనే 11 నెల‌ల శిశువుకు వ‌చ్చిన వ్యాధి పేరు తెలిస్తే పెద్ద‌గా రియాక్ట్ కారేమోగానీ.. దాని వైద్యానికి అయ్యే ఖ‌ర్చు తెలిస్తే మాత్రం ఖ‌చ్చితంగా నోరెళ్ల‌బ‌డ‌తారు. ఆ వ్యాధి పేరు SAM టైప్‌-1. ఇదొక అరుదైన జ‌న్యు లోపం. నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం. మ‌రి, దీనికి చికిత్స చేయించాలంటే.. ఒక‌టీ రెండు కాదు.. రూ.16 కోట్ల‌పైన ఖ‌ర్చు చేయాలి!

ఇంత పెద్ద మొత్తం ఎవ‌రు ఖ‌ర్చు చేయ‌గ‌ల‌రు? కోటీశ్వరులకు తప్ప, మాములు వాళ్లకు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ పాప త‌ల్లిదండ్రులు కూడా మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన వారే. అందుకే.. వారు నిధుల సేక‌ర‌ణ మొద‌లు పెట్టారు. నిధులు సేకరించే ‘మిలాప్’ లో వారి పరిస్థితిని వివరించారు. తద్వారా.. ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా దాతల సహాయం కోరారు. మార్చి నుంచి మొదలైన ఈ పోరాటం మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 14.3 కోట్ల మేర నిధులు సేక‌రించారు. బాలీవుడ్ న‌టులు మొద‌లు ఎంతో మంది ఆ చిన్నారి ప్రాణాలు కాపాడ‌డానికి త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ మందుల‌ను కూడా అమెరికా నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సి ఉంది. మిగిలిన డ‌బ్బులు కూడా జ‌మ అయిన త‌ర్వాత ఆ చిన్నారికి చికిత్స చేయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇటు మ‌న ప్ర‌భుత్వం నుంచి కూడా మందుల‌పై వేసే ప‌న్నుల నుంచి మిన‌హాయింపు కోరారు. ప్ర‌భుత్వం కూడా స‌హ‌క‌రించింది. అంతా స‌వ్యంగా సాగితే.. జూలై 7 నుంచి 10 మ‌ధ్య వైద్యం అందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత మంది కృషి ఫ‌లితంగా లోకం తెలియ‌ని చిన్నారికి చికిత్స‌ జ‌ర‌గ‌నుంది. దీంతో.. అంద‌రూ ఆ పాప ఆరోగ్యంగా తిరిగిరావాల‌ని ఆశిస్తున్నారు.