Begin typing your search above and press return to search.

ప్రాణవాయువు అందక రుయాలో 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి

By:  Tupaki Desk   |   11 May 2021 3:08 AM GMT
ప్రాణవాయువు అందక రుయాలో 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి
X
దారుణం.. మహా ఘోరం చోటు చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాకప్ ప్లాన్ చాలా.. చాలా అవసరం. అందులోకి ఆసుపత్రులు.. పెద్ద పెద్ద దవాఖానాలకు అయితే అది చాలా ముఖ్యం. విడి రోజుల్లో ప్రాణ వాయువు అందక ఇబ్బంది పడటం అనే మాట వినిపించదు. కరోనా సెకండ్ వేవ్ వేళ.. దీని కొరత చాలా ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు కాదు. ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటితో పోలిస్తే.. మనం మెరుగైన పరిస్థితుల్లో ఉన్నా.. కొరత మాత్రం తీవ్రంగా ఉంది. దీంతో.. సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న ఉదంతాలు ఇప్పుడు షాకులు ఇస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ మహానగరంలో కింగ్ కోఠి ఆసుపత్రికి సమయానికి రావాల్సిన ఆక్సిజన్ లారీ.. దారి తప్పి రాకపోవటం.. దీంతో ఐదుగురు (అధికారులు ముగ్గురని చెబుతున్నారు) మరణించటం తెలిసిందే.

ఈ విషాద ఉదంతాన్ని దిగమింగుకునే లోపే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 11 మంది మరణించిన వైనం షాకింగ్ గా మారింది. తప్పులు ఎవరు చేశారు? వైఫల్యం ఎవరిది? మిస్ ప్లానింగ్ ఎవరిది? లాంటి ఎన్నో ప్రశ్నలు వేసుకున్నా.. గాల్లో కలిసి పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఆయా కుటుంబాలకు ఎదురైన శోకాన్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం రుయాలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి 11 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అనధికారికంగా ఈ లెక్క ఎక్కువగా చెబుతున్నారు. వైద్య సేవల్లో చాలా చక్కటి పేరున్న రుయా చరిత్రలో.. దీనికి మించిన విషాద ఉదంతం మరొకటి లేదనే చెప్పాలి.
అసలేం జరిగింది?

తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి చిత్తూరు జిల్లా ప్రజలు మాత్రమే కాదు.. రాయలసీమ.. నెల్లురు జిల్లాకు చెందిన కోవిడ్ బాధితులు చికిత్స పొందుతుంటారు. ఆసుపత్రి ఆవరణలో 11 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. ఈ ట్యాంకర్ నుంచి వెంటిలేటర్.. ఐసీయూ.. ఆక్సిజన్ బెడ్లకు ప్రాణవాయువు సరఫరా అవుతుంటుంది. సోమవారం సాయంత్రం 6-7 గంటల వేళకు ఆక్సిజన్ నిల్వలు అయిపోతాయని.. అంతకు ముందు ఆక్సిజన్ వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ ను సరఫరా చేసే సంస్థకు సమాచారాన్ని ఇచ్చారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చెన్నై నుంచి సాయంత్రం 4 గంటలకు ఆక్సిజన్ బయలుదేరింది. ఆక్సిజన్ ట్యాంకర్ ఎప్పుడు గంటకు నలభై కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణించే అవకాశం లేదు. దీంతో.. తిరుపతికి చేరేసరికి జరగాల్సిన దారుణం జరిగిపోయింది. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి ఆక్సిజన్ నిల్వలు ట్యాంకర్లో 3వేల కిలో లీటర్లకు పడిపోయింది. దీంతో.. సరఫరాకు అవసరమైన ప్రెజర్ అందలేదు. దీంతో ఆక్సిజన బెడ్లు.. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డుల్లోని బెడ్ల మీద చికిత్స పొందుతున్ వారికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది.

ఐసీయూ వార్డులో 51 మంది చికిత్స పొందుతున్నారు. వారిలోనే ఎక్కువమంది మరణించినట్లు చెబుతున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా.. నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రి అధికారులు.. సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే ప్రయత్నం చేశారు. రాత్రి 7.45 గంటలకు చెన్నై నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆసుపత్రికి వచ్చి ట్యాంకర్ లో అన్ లోడ్ చేశారు. యథాతధ పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ మొత్తం ప్రయత్నంలో 15-30 నిమిషాల వ్యవధిలోనే జరగకూడదని దారుణం జరిగిపోయింది.

ప్రాణవాయువు సరఫరాలో చోటు చేసుకునే చిన్న పొరపాటుకు ఎంత ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పక తప్పదు.అయిన వారు తమ కళ్ల ఎదుటే.. ఆక్సిజన్ అందక మరణించటంతో ఆగ్రహం చెందిన బాధితుల బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల్ని.. సిబ్బందిని.. ప్రభుత్వాన్ని నిందిస్తూ.. వైద్య పరికరాల్ని ధ్వంసం చేశారు. వైద్య సిబ్బంది పైనా దాడులకు తెగబడ్డారు. దీంతో.. భయాందోళనకు గురైన వైద్యులు.. సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రిలో 11 మంది ఆక్సిజన్ అందక మరణించినట్లుగా సోమవారం రాత్రి 10.45 గంటల వేళలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అధికారికంగా ప్రకటన చేశారు.