Begin typing your search above and press return to search.

122 శిక్ష‌ణ ఐపీఎస్ ల‌లో 119 మంది ఫెయిల్

By:  Tupaki Desk   |   9 July 2018 4:41 AM GMT
122 శిక్ష‌ణ ఐపీఎస్ ల‌లో 119 మంది ఫెయిల్
X
వారేం చిన్న పిల్ల‌లు కాదు. ఆ మాట‌కు వ‌స్తే అప్పుడే కాలేజీల్లో అడుగు పెట్టిన పోర‌గాళ్లు కూడా కాదు. రేపో మాపో కీల‌క‌మైన బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న ఐపీఎస్ అధికారులు. దేశ వ్యాప్తంగా జ‌రిగే సివిల్స్ ఎగ్జామ్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో వివిధ ద‌శ‌ల్ని దాటి.. క‌ఠిన‌మైన ఇంట‌ర్వ్యూల‌ను ఎదుర్కొని మ‌రీ ఐపీఎస్ లుగా ట్రైనింగ్ అవుతున్న వారు. మ‌రి.. అలాంటి వారు.. ట్రైనింగ్ లో భాగంగా నిర్వ‌హించే ప‌రీక్ష‌లో ఎలాంటి ఫ‌లితాల్ని న‌మోదు చేస్తార‌ని అడిగితే? ఇర‌గ‌దీస్తార‌న్న మాట ఎవ‌రి నోటి నుంచైనా వ‌స్తుంది.

అయితే.. అది శుద్ధ త‌ప్ప‌న్న వైనం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఊహ‌కు అంద‌ని రీతిలో.. షాకింగ్ మారిన ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎస్ అధికారుల‌కు శిక్ష‌ణ‌ను ఇచ్చే ప్రోగ్రామ్‌ ను హైద‌రాబాద్‌ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పోలీసు అకాడ‌మీలో నిర్వ‌హిస్తుంటారు. ఈ శిక్ష‌ణ‌లో భాగంగా ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తారు. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో మొత్తం 122 మందికి 119 మంది ప‌రీక్ష‌లో ఫెయిల్ కావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

అకాడ‌మీ చ‌రిత్ర‌లోనే ఇంత‌మంది ఫెయిల్ కావ‌టం ఇదే తొలిసార‌ని చెబుతున్నారు. ప‌రీక్ష‌లో త‌ప్పినంత‌నే వారికి ఎలాంటి ప్ర‌మాదం ముంచుకు రాదు. కాకుంటే.. మ‌ళ్లీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అయితే.. ఒక్కో స‌బ్జెక్ట్‌ కు మూడుసార్లు ప‌రీక్ష రాసే అవ‌కాశం ఉంటుంది. మూడుసార్లు ప‌రీక్ష త‌ప్పితే మాత్రం ఐపీఎస్ హోదా పోయి ఇంటికి వెళ్లాల్సి వ‌స్తోంది.

సివిల్స్ లాంటి ఎగ్జామ్ ను కొట్టి ఐపీఎస్ కు ఎంపికైన అత్యుత్త‌మ అభ్య‌ర్థులు.. తాజాగా ఇంట‌ర్నల్ ఎగ్జామ్స్ లో ఇంత దారుణంగా ఫెయిల్ కావ‌టంపై అకాడ‌మీ అధికారులు సైతం షాక్ కు గురి అవుతున్నారు. ఐపీఎస్ సాధించామ‌న్న ఆనందం ఒక‌లాంటి నిర్ల‌క్ష్యానికి తెర తీసింద‌ని.. అదే వారిని ఫెయిల్ అయ్యేలా చేసింద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా ఏ అధికారి స్పందించ‌లేదు.