Begin typing your search above and press return to search.

జైట్లీ... 12 ల‌క్ష‌ల కోట్లు ఏమైన‌ట్లు?

By:  Tupaki Desk   |   11 March 2017 10:30 PM GMT
జైట్లీ... 12 ల‌క్ష‌ల కోట్లు ఏమైన‌ట్లు?
X
గ‌డ‌చిన వారం - ప‌ది రోజులుగా ఏ బ్యాంకు ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ఈ ప‌రిస్థితి మ‌రింత విష‌మించింది. మూడు నెల‌ల క్రితం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం దరిమిలా... బ్యాంకులు - ఏటీఎంల వ‌ద్ద క‌నిపించిన దృశ్యాలే ప్ర‌స్తుతం క‌నిపిస్తున్నాయి. నాడు క‌నిపించినంత మేర చాంతాడంత క్యూలు లేకున్నా... ప్ర‌స్తుత క్యూల పొడ‌వు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో పెద్ద నోట్ల ర‌ద్దు - ఆ త‌ర్వాత ఎంట్రీ ఇచ్చిన రూ.2 వేల నోటు - కొత్త రూ.500 నోటు - త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌నున్న కొత్త రూ.10 నోట్లకు సంబంధించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత హైడినామినేష‌న్ నోటుగా రూ.2 వేల నోటు ఉండ‌గా, దాని త‌ర్వాత అత్యంత త‌క్కువ‌గా రూ.500 - రూ.100 నోట్లు మాత్ర‌మే ఉన్నాయి. అంటే రూ..2 వేల నోటుకు చిల్ల‌ర కావాలంటే నాలుగు రూ.500 నోట్ల‌న్నా కావాలి. లేదంటే... 20 రూ.100 నోట్ల‌న్నా కావాలి. దీంతో చిల్ల‌ర స‌మ‌స్య ఒక్క‌సారిగా పీక్ స్టేజికెళ్లింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టిదాకా రూ.12.5 ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే కొత్త నోట్ల‌ను ముద్రించి మార్కెట్లోకి విడుద‌ల చేసిన‌ట్లు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. మ‌రి 12.5 ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే నోట్ల‌న్నీ మార్కెట్‌ లోనే ఉంటే... ఏటీఎంలు ఎందుకు మూత‌ప‌డుతున్న‌ట్ల?. వాటి ముందు జ‌నం బారులు క్ర‌మంగా ఎందుకు పెరిగిపోతున్న‌ట్లు? దీనికి స‌మాధానం చెప్పాల్సింది కూడా జైట్లీనే. మార్కెట్లోకి విడుద‌ల చేసిన నోట్ల విలువ‌ను డినామినేష‌న్‌ తో స‌హా చెప్పిన‌ప్పుడు... ఆ నోట్ల‌న్నీ ఎక్క‌డికి వెళ్లాయో చెప్ప‌క‌పోతే ఎలా? స‌గ‌టు జ‌నం అడుగుతున్న ప్ర‌శ్న ఇదే.

అయితే ఈ ప్ర‌శ్న‌కు జైట్లీ వ‌ద్ద స‌మాధానం లేద‌న్న‌ట్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. గ‌తంలో అక్ర‌మంగా సంపాదించిన న‌ల్ల ధ‌నాన్ని రూ.1000 - రూ.500 నోట్ల రూపంలో దాచేసుకున్న న‌ల్ల కుబేరులు... కేంద్రం మార్చిన రూటు ప్ర‌కార‌మే... త‌మ న‌ల్ల ధ‌నాన్ని రూ.100 - రూ.500 నోట్ల నుంచి రూ.2,000 - రూ.500 నోట్ల‌ల్లోకి మార్చుకున్న‌ట్లుగా కనిపిస్తోంది. ఇదే వాద‌న నిజ‌మైతే... రూ.వెయ్యి నోటు ఉన్న‌ప్సుడు న‌ల్ల కుబేరులు దాచేసిన దాని కంటే కూడా ఇప్పుడు రూ.2 వేల నోటు రూపంలో ఆ న‌ల్ల ధ‌నం రెండింత‌లో, నాలిగింత‌లో అయి ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే.. న‌ల్ల కుబేరుల అక్ర‌మ సంపాద‌న‌కు చెక్ పెట్ట‌డం మోదీ స‌ర్కారుకు కాదు క‌దా... కేంద్రంలో అధికారం చేప‌ట్టే ఏ పార్టీ చేత కూడా కాద‌న్న వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/