Begin typing your search above and press return to search.

తెలంగాణలో డ్రైవింగా.. ‘12’ రానుంది

By:  Tupaki Desk   |   21 Aug 2016 5:01 AM GMT
తెలంగాణలో డ్రైవింగా.. ‘12’ రానుంది
X
రోడ్డు మీదకు రావాలంటేనే భయపడాల్సి వస్తోంది.ఎవరు..ఎట్లా వస్తారో అర్థం కాదు. రోడ్డు మీదకు వచ్చాక మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోని కాలమిది. ఎదుటోడి మీదనే బతుకులు ఆధారపడిన దుస్థితి వచ్చేసింది. ఈ మధ్యన చిన్నారి శాన్వి ఉదంతం తెలిసిందే. ఎవరో ఇంజనీరింగ్ స్టూడెండ్స్ పట్టపగలు పూటుగా మందు కొట్టటం ఏమిటి? ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేయటం ఏమిటి? డివైడర్ కు వారు ఢీ కొడితే.. కారు ఎగిరి పడి అవతల వైపు వెళుతున్న కారు మీద పడటం ఏమిటి? ఆ కారులో ప్రయాణిస్తున్న చిన్నారి శాన్వితో సహా ఆమె తాత.. బాబాయ్ మృత్యువాత పడటం ఏమిటి? ఇదంతా చూస్తే అర్థమయ్యేది ఒక్కటే.. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా.. మన చుట్టూ ఉన్న వారి బాధ్యతారాహిత్యం మన ప్రాణాల మీదకు తెస్తుందని.

ఇలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం ఒకటి తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వాహనదారులకు పాయింట్ల ఆధారంగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా? దాన్ని రద్దు చేయాలా? అన్న అంశాన్ని డిసైడ్ చేయనుంది.

మరింత వివరంగా చెప్పాలంటే.. డ్రైవింగ్ చేసే సమయంలో చేసే తప్పుల కౌంట్ ఇకపై పక్కాగా జరగనుంది.పోలీసులు.. తనిఖీ అధికారులు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తప్పుల్ని గుర్తిస్తే (సెల్ ఫోన్ డ్రైవింగ్.. హెల్మెట్ లేకుండా ఉండటం.. సీటుబెల్ట్ పెట్టుకోకపోవటం వగైరా వగైరా) వెంటనే వారికి జరిమానాతో పాటు వారు చేసిన తప్పుల్ని ఒకటి నుంచి ఐదు మార్కుల మధ్య మార్కులు ఇస్తారు. అలా ఇచ్చిన మార్కులు కానీ 12 దాటితే.. సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలలు బ్యాన్ చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న దీన్ని త్వరలో చట్టబద్ధం చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడున్న చట్టంలో చిన్నపాటి మార్పులు చేయటం ద్వారా ఈ కఠిన నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. ఒక్కసారి కానీ ఈ ‘‘12’’ మార్కుల లెక్క కానీ పబ్లిక్ లోకి వచ్చిందంటే.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేసే వాళ్లకు చెక్ పడినట్లే.