Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు కరోనా వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   6 Feb 2020 11:32 AM GMT
హైదరాబాద్ కు కరోనా వచ్చేసిందా?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసిందా? మొన్నటివరకూ చైనాతో పాటు ఇతర దేశాలకు పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్.. నాలుగైదు రోజుల క్రితమే కేరళలో వెలుగు చూసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అదే సమయంలో కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అంతేకాదు.. కరోనా వైరస్ ను తేల్చే పరీక్షా కేంద్రాన్ని గాంధీలో ఏర్పాటు చేశారు. మొన్నటివరకూ కరోనా అనుమానితుల రక్త నమూనాను ఫూణెకు పంపాల్సి వచ్చేది.

ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టే క్రమంలో గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా వైరస్ ను తేల్చే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ కొందరు అనుమానితుల రక్త నమూనాల్ని పరీక్షించినప్పటికీ కరోనా ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. తాజాగా మరో పన్నెండు మందికి సంబంధించిన రక్త పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) కరోనా అనుమానంతో పలువురు గాంధీలోని ప్రత్యేక వార్డుల్లో చేరారు. దాదాపుపది మంది వరకూ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవల చైనా నుంచి వచ్చిన ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాల్ని వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు కేసులు వస్తున్నా.. కరోనా వైరస్ బారిన పడిన వాళ్లు అంటూ అధికారికంగా ఇప్పటివరకూ ప్రభుత్వం కానీ.. అధికారులు కానీ ప్రకటించలేదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ఇప్పటికే కరోనా వైరస్ ను గుర్తించారని.. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకురాలేదంటున్నారు. ప్రజల్లో మరింత ఆందోళన రేగే అవకాశం ఉందని.. ఈ కారణంతోనే కరోనా పాజిటివ్ కేసుల్ని బయటపెట్టకూడదన్న నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే.. ఇందులో వాస్తవం ఎంతన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక ప్రకటన లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తే ప్రజలు భయాందోళనలకు గురి అవుతారని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కరోనా లాంటి వైరస్ హైదరాబాద్ కు చేరిందన్నది నిజమే అయితే.. ఆ విషయాన్ని ప్రభుత్వం దాచటం వల్ల నష్టమే తప్పించి లాభం జరగదని.. ప్రభుత్వం అలా చేస్తుందని తాను భావించటం లేదని పేరు బయటకు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక ప్రముఖ వైద్యులు వ్యాఖ్యానించారు.

ఎందుకంటే.. వైరస్ హైదరాబాద్ కు చేరిందన్నది ఒక ఎత్తు అయితే.. దాని విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని.. అందుకే అలాంటి విషయాల్ని దాచి పెడుతుందని తాను భావించటం లేదని మరో ప్రముఖ వైద్యులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా.. కరోనా వైరస్ అనుమానిత కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. దీనిపై ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.