Begin typing your search above and press return to search.

122 మంది మావోయిస్టులు లొంగిపోయారు

By:  Tupaki Desk   |   10 April 2016 7:30 AM GMT
122 మంది మావోయిస్టులు లొంగిపోయారు
X
ఛత్తీస్ గఢ్ అంటే మావోయిస్టుల ఖిల్లా. ఆ రాష్ట్రంలో సగానికిపైగా ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతమే. నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక అలజడి జరుగుతూనే ఉంటుంది. అదేసమయంలో పోలీసుల ప్రయత్నాలు ఫలించి అడపాదడపా మావోయిస్టుల లొంగుబాట్లు సాధ్యవముతున్నా ఒకరిద్దరు కంటే ఎక్కువ లొంగిపోయిన సందర్భాలు తక్కువ. ఛత్తీస్ గఢ్ లోనే కాదు... దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు లేనట్లుగా ఒకేసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఏకంగా 122 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు.

బస్తర్ రేంజ్ లోని సుకుమా జిల్లా మావోయిస్టులు, వారి కోసం వేటాడే భద్రతా దళాలతో నిత్యం అట్టుడుకుతుంది. ఎన్ కౌంటర్లతో అక్కడి అడవులు దద్దరిల్లుతుంటాయి. కాల్పుల మోత అక్కడ నిత్యం కృత్యం. మందుపాతర చప్పుడు చాలా కామన్. అలాంటి చోట ఐజీ ఎస్ ఆర్పీ కల్లూరి - ఇతర సీనియర్ అధికారుల ఎదుట 122 మంది మావోయిస్టులు ఒకేసారి ఆయుధాలతో సహా లొంగిపోయారు. నక్సలైట్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతం నుంచి భారీగా లొంగుబాట్లు జరగడంతో పోలీసు వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీరిలో చాలా మంది తలలపై రివార్డులు ఉన్నాయి... గతంలో పలు హింస - విధ్వంసం ఘటనలతో సంబంధాలు ఉండి కేసుల్లో ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నిబంధనల ప్రకారం అందరికీ పునరావాస సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొన్నారు.