Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ లో ‘నాంది’ సినిమా.. 127 మంది ముస్లింల‌ అరెస్టు.. 20 ఏళ్ల త‌ర్వాత నిర్దోషులుగా!

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 AM GMT
గుజ‌రాత్ లో ‘నాంది’ సినిమా.. 127 మంది ముస్లింల‌ అరెస్టు.. 20 ఏళ్ల త‌ర్వాత నిర్దోషులుగా!
X
ఇటీవ‌ల విడుద‌లైన ‘నాంది’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. చేయని నేరానికి అన్యాయంగా అరెస్టు అయిన‌ ఓ వ్య‌క్తి.. ఐదేళ్ల‌పాటు విచార‌ణ ఖైదీగా జైల్లో శిక్ష అనుభ‌విస్తాడు. ఆ త‌ర్వాత అక్ర‌మంగా కేసు పెట్టార‌ని స‌ద‌రు వ్య‌క్తిని కోర్టు విడుద‌ల చేస్తుంది. కానీ.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం మొత్తం జ‌రిగిపోతుంది. త‌ల్లిదండ్రులు చనిపోతారు. తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి.. మ‌రొక‌రి భార్య అవుతుంది. ఉద్యోగం పోతుంది. ఇలా.. అత‌ని జీవితం మొత్తం నాశ‌న‌మైపోతుంది! ఇలాంటి వారు దేశంలో వేలాదిగా ఉన్నారు.

అలాంటి అమాయ‌కుల‌కు సంబంధించిన ఓ ఘ‌ట‌న గుజ‌రాత్ లో వెలుగు చూసింది. నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ (సిమి)తో సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో 127 మంది ముస్లింల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ.. 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత వారు నిర్దోషులు అని కోర్టు తీర్పు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

సూర‌త్ లో 2001లో ఓ మైనారిటీ వ‌ర్క్ షాప్ నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చారు. కానీ.. స‌మావేశం జ‌ర‌గ‌డానికి ఒక రోజు ముందు 127 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్ర‌మ కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద వారిని జైలుకు త‌ర‌లించార‌ని బాధితులు చెప్పారు. ఆ త‌ర్వాత దాదాపు 13 నెల‌ల వ‌ర‌కు వారు జైలులో శిక్ష అనుభ‌వించారు. ఆ త‌ర్వాత కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ కోర్టు వాయిదాల‌తో తిరుగుతూనే ఉన్నామ‌ని బాధితులు వెల్ల‌డించారు. తాజాగా.. శ‌నివారం వారు నిర్దోషులంటూ న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది.

ఈ తీర్పుతో బాధితులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌మ‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించ‌డం సంతోషం. కానీ.. ఇన్నాళ్లు మేం కోల్పోయిన వాటి సంగ‌తేంట‌ని అంటున్నారు. త‌మ‌ను ఉగ్ర‌వాదులుగా చూశార‌ని, మ‌త త‌త్వ ముద్ర‌వేశార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. జ‌నం త‌మ‌ను బ‌హిష్క‌రించార‌ని, త‌మ‌లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, జీవితం మొత్తం స‌ర్వనాశ‌నం అయ్యింద‌ని క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు. ఇవ‌న్నీ ఎవ‌రు పూడుస్తార‌ని? ఎలా పూడుస్తార‌ని ప్ర‌శ్నించారు.