Begin typing your search above and press return to search.

ఇండియ‌న్స్‌ పై జికా వైర‌స్ ఎటాక్

By:  Tupaki Desk   |   1 Sep 2016 9:13 AM GMT
ఇండియ‌న్స్‌ పై జికా వైర‌స్ ఎటాక్
X
ప్ర‌పంచంలో ఎప్పుడు ఏదో ఒక వైర‌స్ హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆట‌లు ఆడుతూనే ఉంది. అప్పుడెప్పుడో బ‌య‌ట‌పడ్డ జికా వైర‌స్ ఇప్ప‌డు మ‌ళ్లీ వార్త‌ల్లో్కి వ‌చ్చింది. గ‌తంలో బ్రెజిల్‌ ను వ‌ణికించిన ఈ వైర‌స్ దెబ్బ‌కి అమెరికా స‌హా అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు సైతం చివురుటాకుల్లా వ‌ణికి పోయాయి. తమ దేశంలో విదేశీయుల‌ను అనుమ‌తించ‌డంపై కూడా అనేక ఆంక్ష‌లు విధించాయి. దోమ‌ల వ‌ల్ల వ్యాపించే జికా వైర‌స్‌.. వ్య‌క్తి లోని ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించింది. కాబ‌ట్టి దోమ‌ల నుంచి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా పిలుపు కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఆడ‌దోమ‌ల కార‌ణంగా వ్యాపించే ఈ వైర‌స్ గ‌ర్భిణుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపింది.

దీంతో ఇక్క‌డ మ‌న దేశంలోనూ అప్ప‌ట్లో దోమ‌ల నుంచి ర‌క్ష‌ణ‌కు అనేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. సింగ‌పూర్‌ లో జికా వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా వివిధ ఉపాధుల కోసం సింగ‌పూర్ వెళ్లిన దాదాపు 13 మంది భార‌తీయులు ఈ వైర‌స్ బారిన ప‌డిన‌ట్టు భార‌త విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో ప్ర‌భుత్వం హుటాహుటిన అలెర్ట్ అయింది. మొదటగా భవన నిర్మాణ కార్మికులలో జికా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.జికా నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేప‌డుతోంది. దోమ‌ల నిర్మూల‌నకు పెద్ద ఎత్తున యుద్ధం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం నిధుల‌ను కూడా మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది.

ప్ర‌జ‌లంద‌రూ మురుగునీటిని నిల్వ‌కుండా చూడాల‌ని, కాచి చ‌ల్లార్చిన నీటినే తాగాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దోమ‌ల నుంచి ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త తీసుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. అయితే, ఇప్ప‌టికీ.. జికా వైర‌స్ అదుపులోకి రాలేద‌ని వైద్యులు తెలిపారు. అయితే, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు - వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక‌, జికా వైర‌స్ ప్ర‌భావంతో చిన్నారుల్లో ఎదుగుద‌ల లోపం ఉంటుంద‌ని, ముఖ్యంగా గ‌ర్భ‌స్థ శిశువుల్లో ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు వైద్యులు. ఇక‌, భార‌తీయుల విష‌యానికి వ‌చ్చే స‌రికి సింగ‌పూర్‌ లోని భార‌తీయులు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని భార‌త ప్ర‌భుత్వం కూడా హెచ్చ‌రించింది. ఈ మాత్రం ఇబ్బంది అనిపించినా.. వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు సూచించారు.