Begin typing your search above and press return to search.

చిత్తూరులో ఘోర ప్ర‌మాదం...20 మంది దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   21 April 2017 2:34 PM GMT
చిత్తూరులో ఘోర ప్ర‌మాదం...20 మంది దుర్మ‌ర‌ణం
X
చిత్తూరు జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రోడ్డులో ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని లారీ దుకాణాలపైకి దూసుకెళ్లింది. వేగంగా వస్తున్న లారీ దూసుకురావడంతో అక్కడే ఉన్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా... 20 మందికి మృత్యువాత ప‌డ్డారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత‍్తం రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా, పూతలపట్టు, నాయుడుపేట రహదారిపై రాకపోకలు స్తంబించాయి. కాగా, ఏర్పేడు మండ‌లంలో జ‌రిగిన లారీ ప్ర‌మాదానికి సంబంధించి.. డ్రైవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో వాహ‌నం న‌డిపాడ‌ని పోలీసులు భావిస్తున్నారు.

మ‌రోవైపు ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పేడు పీఎస్ ఎదుట మునగలపాలెం వాసులు ధర్నా చేస్తుండగా లారీ దూసుకు వచ్చింది. మొదట ఈ వాహనం వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ప‌లు వ‌ర్గాల్లో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడని పోలీసులు భావిస్తున్నారు. మ‌రోవైపు ఏర్పేడు రోడ్డు ప్రమాదం లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. కొద్ది సేపటి కిందట ఇక్కడ సమావేశమైన ఏపీ కేబినెట్ ముందుగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తలిపింది. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది.

ఇదిలాఉండ‌గా....చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మంది మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/