Begin typing your search above and press return to search.

పెళ్లింట మోగిన మరణ మృదంగం.. బావి శ్లాబ్ కూలి 13 మంది మహిళలు మృతి

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:45 AM GMT
పెళ్లింట మోగిన మరణ మృదంగం.. బావి శ్లాబ్ కూలి 13 మంది మహిళలు మృతి
X
దారుణ విషాదం చోటు చేసుకుంది. కలలో కూడా ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 13 మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయాలయ్యారు. ఈ దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఖుషీ నగర్ జిల్లా నెబువా నౌరంజియా వద్ద చోటు చేసుకుంది. దీంతో.. ఇప్పటివరకు సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. బాధితులు.. బంధువుల ఆర్తనాదాలతో పెళ్లింట మరణ మృదంగం మోగింది.

పెళ్లి వేళ నిర్వహించే హల్దీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు.. యువతులు బావిపైన ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్ మీద నిలుచున్నారు. అనుహ్యంగా బాలి ఇనుప గ్రిల్ కు ఆధారంగా ఉండే శ్లాబ్ కూలిపోవటం ఆ వెంటనే.. గ్రిల్ పైన నిలుచున్న పలువురు మహిళలు.. బాలికలు ఒక్కసారిగా బావిలో పడిపోయారు. బావిలో పడ్డ వారిలో 15 మందిని స్థానికులు రక్షించారు. మరో 11 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన పలువురిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

వైద్య సేవలు అందుకునే క్రమంలో మరో ఇద్దరు మహిళలు మరణించారు. ఈ ఉదంతంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పెళ్లికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వైనంతో బాధితుల రోదనలు మిన్నంటాయి. ఆ పెళ్లి ఇల్లు రోదనలతో దద్దరిల్లిపోతోంది. ఈ దారుణ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని పేర్కొన్న ఆయన.. మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.