Begin typing your search above and press return to search.

అమ్మాయిని చూశాడని చంపేశారు

By:  Tupaki Desk   |   9 July 2015 9:12 PM IST
అమ్మాయిని చూశాడని చంపేశారు
X
హైస్కూలు చదువుతున్న పిల్లలు తమ తోటి విద్యార్థిని కొట్టి చంపేశారు.. కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే... వారేదో ఆటల్లోనో, చదువులోనో అనవసర పోటీల కారణంగా గొడవ పడలేదు... లేదంటే ఒకరినొకరు అవమానించుకుని ఆగ్రహంతో కొట్టుకోలేదు... ఆ కొట్లాటకు కారణం వింటే పిల్లలు ఎటువైపు పోతున్నారో అనిపిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా రాజ్‌పూర్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న కిరణ్‌ అనే అబ్బాయిని తోటి విద్యార్థులు కొట్టి చంపేశారు. అదే క్లాసులో చదువుతున్న అమ్మాయిని కిరణ్‌ తదేకంగా చూశాడన్న కారణంతో మిగతావిద్యార్థులంతా ఆయనపై దాడి చేశారు.

దాదాపు పదిహేను రోజుల కిందట జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా బయటపడింది. ఎనిమిదో తరగతి చదువుతున్న కిరణ్‌ అదే క్లాసు చదువుతున్న ఓ అమ్మాయిని తదేకంగా చూశాడంట... దీంతో ఇంకొందరు విద్యార్థులు కిరణ్‌పై కోపం పెంచుకుని సమయం చూసి కిరణ్‌ తలను స్కూలు బెంచికి మోదారు.. అక్కడితో ఆగకుండా స్కూళ్లో ఉన్న ఓ చెట్టుకేసి కొట్టారు. దీంతో కిరణ్‌ స్శృహ కోల్పోయాడు... విద్యార్థులంతా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో కిరణ్‌ చనిపోయాడు.

అయితే... పోలీసులు పాఠశాలకు వచ్చి విచారించగా ముగ్గురు విద్యార్థులు కొట్టడంతో కిరణ్‌ చనిపోయినట్లు తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. కాగా గత నెల రోజుల్లో మహారాష్ట్రలో ఇలా స్కూళ్లోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. టీనేజ్‌లోనే విద్యార్థుల్లో విలువలు లోపించడం... మంచీచెడు విచక్షణ లేకపోవడం.. హత్యకు సైతం వెనుకాడని ప్రవర్తన కారణంగానే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.