Begin typing your search above and press return to search.

కుప్పకూలనున్న కర్ణాటక ప్రభుత్వం..?

By:  Tupaki Desk   |   6 July 2019 9:46 AM GMT
కుప్పకూలనున్న కర్ణాటక  ప్రభుత్వం..?
X
కర్ణాటక ప్రభుత్వం మళ్లీ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. దినదినగండంగా నడుస్తున్న కుమారస్వామి ప్రభుత్వానికి ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాల అంశం తలపోటుగా మారింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధిస్తూ ఉన్నారు.

తాము సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చదలుచుకోలేదని బీజేపీ ప్రకటించింది. అయితే ఇటు కాంగ్రెస్- అటు జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతోందని పరిశీలకులు ఏర్పాడుతూ ఉన్నారు.

ఇప్పటికే స్పీకర్ ను కలిసి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలను ఇచ్చారు. తాము ఎమ్మెల్యేలుగా కొనసాగదలుచుకోలేదని వారు తేల్చి చెప్పారు. తాజాగా మరి కొందరు ఆ జాబితాలో చేరినట్టుగా తెలుస్తోంది. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు, వారికి తోడు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాటన పడుతూ ఉన్నారు. మొత్తంగా పదకొండు మంది రాజీనామా అంటున్నారట!

వారి రాజీనామాలు ఆమోదం పొందితే కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలుంటాయి. అప్పుడు అటోమెటిక్ గా అవకాశం బీజేపీ వైపు వెళ్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలు దానితో పాటే ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లూ అటు వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు గవర్నర్ పిలిచి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఎన్నికల ఊహాగానాలూ ఉన్నాయి.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కుమారస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్ ను కోరవచ్చు. తమ ప్రభుత్వం కూలితే బీజేపీకి అవకాశం దక్కుతుందనే భావనతో ఆయన మధ్యంతరానికే మొగ్గు చూపవచ్చనే ఊహాగానాలున్నాయి. అయితే బీజేపీ గవర్నర్ ద్వారా ఎలాంటి రాజకీయాన్ని నడిపిస్తుందనేది కూడా ఆసక్తిదాయకమైన అంశమే!