Begin typing your search above and press return to search.

మళ్లీ కోరలు చాస్తున్న కరోనా ... 24 గంటల్లో 14 వేల పాజిటివ్ కేసులు , హైఅలర్ట్ !

By:  Tupaki Desk   |   20 Feb 2021 7:30 AM GMT
మళ్లీ కోరలు చాస్తున్న కరోనా ...  24 గంటల్లో 14 వేల పాజిటివ్ కేసులు , హైఅలర్ట్ !
X
కరోనా వైరస్ మహమ్మారి జోరు నెమ్మదిగా తగ్గిపోతుంది , అలాగే ఈ లోపే వ్యాక్సిన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక అన్నీ మంచి రోజులే అని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దేశంలో కరోనా జోరు మళ్లీ మెల్లి మెల్లిగా మొదలైంది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 13,993 మందికి కరోనా నిర్ధారణ అయింది. 27 రోజుల తరువాత మరోమారు అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి అదే స‌మ‌యంలో 10,307 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది.

అలాగే ,గడిచిన 24 గంట‌ల సమయంలో 101 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,212కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,78,048 మంది కోలుకున్నారు. ఒక్క మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 6,112 కరోనా కేసులు నమోదయ్యాయి. 44 మంది కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. అలాగే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా జోరు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తుంది. దీనితో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు స్ట్రెయిన్ వైరస్ కూడా తన జోరు చూపిస్తుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో కరోనా కేసుల్లో జోరు పెరుగుతుండడంతో.. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కరోనా‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కరోనా నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్‌ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్‌ వేవ్‌ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే, సెకండ్‌ వేవ్ ‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్‌ వేవ్‌ లో కొత్త స్ట్రెయిన్‌ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు.