Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే స‌వాల్‌ తో 144 సెక్ష‌న్‌

By:  Tupaki Desk   |   21 Aug 2016 8:33 AM GMT
టీఆర్ ఎస్ ఎమ్మెల్యే స‌వాల్‌ తో  144 సెక్ష‌న్‌
X
గిరిజ‌న నాయ‌కుడి విగ్ర‌హ ఏర్పాటు వివాదం ఏకంగా అధికారులు వ‌ర్సెస్ అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మారింది. అనంత‌రం ఆదివాసీ గిరిజ‌నులు జాయింట్ క‌లెక్ట‌ర్ తీరును నిర‌సిస్తూ ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఏకంగా 144 సెక్ష‌న్ విధించే ప‌రిస్థితి వ‌చ్చింది. మాజీ మంత్రి కొట్నాక భీంరావు విగ్రహం ఏర్పాటు ఆయ‌న కుమార్తె-ఎమ్మెల్యే కోవ ల‌క్ష్మీ - స‌బ్ క‌లెక్టర్‌ మధ్య తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. విగ్రహ ఏర్పాటు పనులకు అనుమతులు తెచ్చుకోవాలని సబ్‌ కలెక్టర్ స్ప‌ష్టం చేయ‌డం - తమ ప్రభుత్వంలో మీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే భీష్మించుకోవ‌డంతో అటు అధికారులు... ఇటు రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా పరిణమించింది. ఈ వివాదం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌ లో జరిగింది.

ఈనెల 29న తన తండ్రి - మాజీ మంత్రి కొట్నాక భీంరావు వర్ధంతి నేపథ్యంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్‌ పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప‌లువురి సూచన మేరకు జూబ్లీమార్కెట్‌ కు వెళ్లేమార్గంలోని ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై విగ్రహం ఏర్పాటుకు గుంతను తవ్వించారు. అయితే, ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవంటూ సబ్‌కలెక్టర్ అద్వైత్‌ కుమార్ సింగ్ పనులు నిలిపి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికార పార్టీ నేతలు - గిరిజన సంఘాలు తొలుత ఆందోళన చేయాలని నిర్ణయించాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై గుమిగూడిన తెరాస నాయకులు - కార్యకర్తలతో సబ్ కలెక్టర్ చర్చించారు. నడిరోడ్డుపై పనులు చేసేందుకు అనుమతి లేదని ఆయన వారికి తేల్చిచెప్పారు. దీంతో వెనక్కి తగ్గిన టీఆర్‌ ఎస్ నాయకులు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం మాజీ మంత్రి విగ్రహాన్ని పెద్దవాగు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని భావించారు. ఈమేరకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి - అధికారులు - నాయకులు - కార్యకర్తలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌ అండ్‌ బి అధికారులు కొలతల ప్రకారం విగ్రహం ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు. ఈ సమాచారం అందుకున్న సబ్‌ కలెక్టర్ అద్వైత్‌ కుమార్ సింగ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతి లేదంటూ పనులు ఆపించడంతో పాటు, అక్కడే ఉన్న జెసిబి, ఇతర యంత్రాలను సీజ్ చేశారు.

స‌బ్ క‌లెక్ట‌ర్ నిర్ణ‌యంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి పనులు నిలిపి వేసిన చోటికి చేరుకొని ఇది అన్యాయం అని మండిప‌డుతూ గిరిజనులకు ఇంకా అవమానాలు తప్పడం లేదని ఆగ్రహిస్తూ సబ్‌ కలెక్టర్‌ తో వాగ్వాదానికి దిగారు. ఆదివాసీ నాయకుడి కోసం చేపడుతున్న పనులు ఆపడం గిరిజనులను అవమానించడమే అంటూ మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా చట్టాలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని అధికారులు ఓ ఆదివాసీ నాయకుడి విగ్రహ ఏర్పాటుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిండం సరికాదని సబ్‌ కలెక్టర్‌ ను నిలదీశారు. దీనిపై స్పందించిన సబ్‌ కల్టెకర్ ఎవరి అనుమతి తీసుకొని పనులు ప్రారంభించారని, అనుమతి పొందిన తరువాతే పనులు మొదలెట్టాలని స్పష్టం చేశారు. సబ్‌ కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యే బహిరంగంగానే ఘాటుగా స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ దశలో కలెక్టర్‌ తో ఫోన్‌ లో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో, అనుమతి లభించే వరకు ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే స‌వాల్ చేశారు. అవసరమైతే ఆదివాసీలతో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సబ్‌ కలెక్టర్ స్పందిస్తూ ఎంతటి వారైనా నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌టం గ‌మ‌నించిన జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు పనులు జరిగే ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. విగ్ర‌హం ఏర్పాటు కోసం ఉద్దేశించిన‌ పెద్దవాగు ప్రాంతంలో భారీగా మొహరించిన పోలీసులు తెరాస నాయకులు - కార్యకర్తలతో పాటు జనాలను పంపించి వేశారు.