Begin typing your search above and press return to search.

9/11కు పదిహేనేళ్లు...

By:  Tupaki Desk   |   11 Sep 2015 1:30 PM GMT
9/11కు పదిహేనేళ్లు...
X
9/11.... అంటే ఏమిటో తెలియనివారు ఎవరూ ఉండరేమో... అమెరికా వెన్నులో చలి పుట్టించిన 9/11 ఘటనకు పదిహేనేళ్లయింది.. 110 అంతస్తుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం నిలువునా కుప్పకూలింది... విమానాలు వచ్చి నేరుగా భవనంలోకి దూసుకెళ్లడంతో అమెరికాయే కాదు ప్రపంచమంతా ఉలిక్కిపడింది... అయితే, ఇది ప్రమాదం కాదు.. ఉగ్రవాద చర్య... 3 వేల మందిని పొట్టనపెట్టుకున్న ఈ దాడితో ఒసామా బిన్ లాదెన్ ను ప్రపంచానికంతటికీ విలనయ్యాడు. 2001 లో ఈ దాడి జరిగిన తరువాత ప్రపంచంలో ఉగ్రవాదం మరింత పెరిగింది. ఒసామా బిన్ లాదెన్ పెద్ద ఉగ్రవాదశక్తిగా మారిపోయాడు. ఆ రోజు ఏం జరిగిందన్నది తలచుకుంటే ప్రత్యక్ష సాక్షులకు, అమెరికన్ లకూ ఇప్పటికీ కాళ్లు వణుకుతాయి.

అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన 110 అంతస్తుల జంట భవనాలు 2001 సెప్టెంబరు 11న ఉగ్రవాద దాడిలో నేలకూలాయి. 3 వేల మందికిపైగా ఈ దాడిలో మృతిచెందడంతో ప్రపంచం తల్లడిల్లిపోయింది. ప్రపంచంలో ఇంతకంటే భయంకరమైన ఉగ్రవాదదాడి ఇంతవరకు లేనేలేదు.

ఆ రోజు తెల్లతెల్లవారుతుండగానే ఆల్ ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేశారు. వాటిలో ఒక విమానాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు గురిపెట్టి ఉరికించారు. సరిగ్గా 8.46 గంటలకు ఇది జంట భవనాల్లో ఒకదాన్ని నేరుగా ఢీకొంది. అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్లుగా మంటలు పొగా వ్యాపించాయి... ఏం జరిగిందో తెలుసుకునేలోగానే 9.03 గంటలకు మరో విమానం రెండో టవర్ ను ఢీకొంది. భూకంపం వచ్చినట్లుగా రెండు భవనాలు నేలమట్టమైపోయాయి. మూడో విమానం 9.37 నిమిషాల్లో అమెరికా ప్రధాన రక్షణ కార్యాలయం.... శత్రు దుర్బేధ్యమైన పెంటగాన్ ను గురిపెట్టింది. ఆ దాడిలోనూ వందలమంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగో విమానం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను లక్ష్యంగా చేసుకుని కదిలింది. కానీ ఇందులోని ప్రయాణికులు హైజాకర్లను ఎదిరించి ఎదురుదాడి చేశారు. ఈ గలాటాలో ఆ విమానం కుప్పకూలిపోయింది.

90 దేశాలకు ప్రాణ నష్టం...

జంట సౌధాలు, పెంటగాన్, విమాన ప్రయాణికులు.. ఉగ్రవాదులు అంతా కలిసి మూడు వేలకు పైగా ఈ దాడుల్లో మరణించారు. మొత్తం 90 దేశాల వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచమంతా ఈ ప్రభావానికి లోనయినట్లయింది.

1996లోనే ప్లానింగ్...

ఈ భయంకరమైన ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారైన ఖలీద్ మహమూద్ 1996లోనే ఈ చర్యకు పథక రచన చేశాడు. ఆల్ ఖైదా చీఫ్ లాదెన్ కు దీన్ని వివరించగా ఆయన 1999లో అనుమతి ఇచ్చాడు. హైజాకర్లను ఎంచుకుని.. శిక్షణ ఇచ్చి అన్నిరకాలు సిద్ధం చేసి 2001లో ఈ భీకర ప్లాను అమలు చేశారు.

భారీ నష్టం..

ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ దాడిలో ప్రాణనష్టంతో పాటు భారీ ఆర్థిక నష్టం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలింది. చుట్టుపక్కల భవనాలూ దెబ్బతిన్నాయి. సమీప భవనాల్లో విషవాయువులు వ్యాపించి ఇప్పటికీ వినియోగానికి పనికిరాకుండానే ఉన్నాయి. అగ్రరాజ్యాన్నే వణికించడంతో ప్రపంచ మార్కెట్లన్నీ కొలాప్సయ్యాయి. భారీ ఆర్థిక నష్టాలు సంభవించాయి.