Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో రక్తం తాగుతున్న రోడ్లు

By:  Tupaki Desk   |   12 May 2019 9:18 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో రక్తం తాగుతున్న రోడ్లు
X
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తం తాగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి. కర్నూలులోని వెల్దుర్తిలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి చూపుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను గద్వాల వాసులుగా గుర్తించారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఆదివారం ఉదయం హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ నుంచి మెట్‌ పల్లి వెళ్తున్నఆర్టీసీ బస్సు తిమ్మాపూర్ మండలంలోని నుస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఆ సమయంలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. అయితే, పరిమిత వేగంతోనే బస్సు నడుస్తుండడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. బస్సు వేగం ఏమాత్రం పెరిగి ఉన్నా ఘోర ప్రమాదం జరిగేదని చెబుతున్నారు.