Begin typing your search above and press return to search.

ఒకేసారి 15 ప‌బ్ ల‌కు తాళాలా?... రీజ‌నిదేన‌ట‌!

By:  Tupaki Desk   |   27 April 2019 9:46 AM GMT
ఒకేసారి 15 ప‌బ్ ల‌కు తాళాలా?... రీజ‌నిదేన‌ట‌!
X
హైదరాబాద్ లో ఇప్పుడు ఓ వార్త వైర‌ల్ గా మారిపోయింది. న‌గ‌రంలోని సంప‌న్నుల ప్రాంతంగా ముద్ర‌ప‌డ్డ జూబ్లీ హిల్స్ ప‌రిధిలో ఇప్పుడు పెద్ద సంఖ్య‌లో ప‌బ్ లు కొన‌సాగుతున్నాయి. పుట్ట‌గొడుగుల్లా వెల‌సిన ఈ ప‌బ్ ల‌లో బ‌డాబాబుల పిల్ల‌లు నిత్యం మ‌త్తులో మునిగితేలుతుంటారు. వీకెండ్స్ తో పాటు స్పెష‌ల్ అకేష‌న్స్ పేరిట ఈ ప‌బ్ ల‌లో జ‌రుగుతున్న గోల అంతా ఇంతా కాదు. ఇక ఈ ప‌బ్ ల‌లో పీక‌ల్దాకా మ‌ద్యం సేవించి అదే మ‌త్తులో కార్ల‌తో రోడ్డెక్కుతున్న బ‌డా బాబుల పిల్ల‌లు డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీలకు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ లో అది కూడా సెలెక్టివ్ గా ఓ రెండు రోడ్ల‌లోని ప‌బ్ ల‌కు ఇప్పుడు తాళాలు ప‌డిపోయాయ‌ట‌.

ఈ వార్త ఇప్పుడు నిజంగానే వైర‌ల్ గా మారిపోయింది. ఆ వివ‌రాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబ‌రు 36, 45ల‌లో ఏకంగా 15కు పైగా ప‌బ్ లు ఉన్నాయి. వీటిలో యునైటెడ్ కిచెన్స్ -హార్డ్ కప్ కేఫ్ - సెలెబ్రేషన్స్ త‌దిత‌ర జ‌నం నోళ్ల‌లో బాగా నానుతున్న ప‌బ్ లు కూడా ఉన్నాయి. అయితే నేటి ఉద‌యం ఈ ప‌బ్ ల‌ను అధికారులు మూసివేయించార‌ట‌. ఇప్ప‌టిదాకా లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వ‌చ్చింది? అన్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న ప్ర‌శ్న ఈ ప‌బ్ ల‌కు ఇప్ప‌టికే అధికారులు సీల్ వేయ‌గా... ఇవి మ‌ళ్లీ ఎప్పుడు తెర‌చుకుంటాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఇక ఈ ప‌బ్ ల మూత‌కు గ‌ల కార‌ణాల‌ను ఆరా తీస్తే... ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి.

స‌రిప‌డ పార్కింగ్ స‌దుపాయం లేద‌ని - అగ్నిమాప‌క శాఖ నిర్దేశించిన మేర ఫైర్ సేఫ్టీ ప్రమాణాల‌ను ఈ ప‌బ్ లు పాటించ‌డం లేద‌ని - అనుమ‌తులు లేని బిల్డింగ్ ల‌లో వీటిని నిర్వ‌హిస్తున్నార‌ని.... ఇలా చాలా కార‌ణాలే వినిపిస్తున్నాయి. అయినా అనుమ‌తులు ఇచ్చే ముందు వీట‌న్నింటినీ క్షుణ్ణంగా ప‌రిశీలించిన మీద‌టే క‌దా పర్మిష‌న్లు ఇవ్వాల్సింది. ఈ లెక్క‌న ప‌ర్మిష‌న్లు ఇచ్చేట‌ప్పుడు తూతూమంత్రంగా త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు... ఇప్పుడు వాటిపై కొర‌డా ఝుళిపిస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. కార‌ణాలు ఏవేతైనేం... ఒకేసారి 15 ప‌బ్ లు మూత‌ప‌డ్డాయ‌న్న వార్త‌లు ఇప్పుడు హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకించి బ‌డా బాబుల పిల్ల‌లో వైర‌ల్ న్యూస్ గా మారిపోయింది.