Begin typing your search above and press return to search.

డీజిల్ కార్లకు పెద్ద చావొచ్చింది​

By:  Tupaki Desk   |   25 Dec 2015 4:43 AM GMT
డీజిల్ కార్లకు పెద్ద చావొచ్చింది​
X
వాణిజ్య వాహనాలకు సంబంధించి మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే.. అవునని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా వాతావరణ పరిస్థితుల మీద వస్తున్న మార్పులు నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని చెబుతున్నారు. ఇప్పటికే వాయు కాలుష్యం మీద సమర శంఖం పూరించిన ఢిల్లీ రాష్ట్ర సర్కారు ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం కావటంతో పాటు.. సర్వోన్నత న్యాయస్థానం సైతం సానుకూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

వాయు కాలుష్యం మీద అవగాహన పెరగటం.. దాని తీవ్రత సామాన్య ప్రజల మీద ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై కీలక నిర్ణయాలకు ఇదే సరైన సమయంగా కేంద్రం భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దేశ వ్యాప్తంగా వినియోగించే వాణిజ్య వాహనాల్ని 15 ఏళ్లు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతకు మించి వినియోగించేందుకు అనుమతులు ఇవ్వరు.

వాణిజ్య వాహనాల అయుష్షు 15 ఏళ్లుగా ఫిక్స్ చేయటంతో పాటు.. ఆ తర్వాత వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి చట్టాన్ని 2016 ప్రధమార్థంలో తీసుకురావాలన్న ప్రయత్నంలో మోడీ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానంలో వాణిజ్య వాహనాలు ఫిట్ నెస్ ఉంటే రోడ్ల మీదకు అనుమతించే వారు. కానీ.. అలాంటి వాటితో సంబంధం లేకుండా వాహన కొనుగోలు మొదలు 15 ఏళ్ల వరకు మాత్రమే రోడ్ల మీద తిరిగేలా చట్టం రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి తగినట్లుగా చట్టం తీసుకొస్తే వచ్చే పరిణామాలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.