Begin typing your search above and press return to search.

151 మంది ఎమ్మెల్యేలు..151 గంట‌ల దీక్ష‌!

By:  Tupaki Desk   |   8 Feb 2020 3:09 PM GMT
151 మంది ఎమ్మెల్యేలు..151 గంట‌ల దీక్ష‌!
X
ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ క‌క్ష సాధిస్తున్నార‌ని, ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకున్న నిర్ణ‌యాలను జ‌గ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కోట్లు ఖ‌ర్చుపెట్టి నిర్మించిన ప్ర‌జా వేదిక కూల్చివేత మొద‌లు.....సీఆర్డీఏ ర‌ద్దు వ‌ర‌కు ప‌లు వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ తీసుకున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అమరావతి నగర పరిధి నుంచి ఉండవల్లి - పెనుమాక - ఎర్రబాలెం - నవులూరు - బేతపూడి గ్రామాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమ‌రావ‌తి న‌గ‌ర‌ ప‌రిధి నుంచి ఐదు గ్రామాల‌ను తొల‌గిస్తూ ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాడేపల్లి - మంగళగిరి పురపాలక సంఘాల్లో ఆ ఐదు గ్రామాల‌ను విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపు - సీఆర్డీఏ ర‌ద్దు నిర్ణ‌యాల‌తో ప్ర‌భుత్వంపై ఆ ప్రాంత ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. తాజాగా కుట్రపూరితంగానే రాజధాని నగర పరిధి నుంచి త‌మ గ్రామాల‌ను తొలగించారని ఆయా గ్రామాల ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా తాము ఆందోళన చేస్తున్నామ‌ని - అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయ‌బోతున్నామ‌ని అన్నారు.

మ‌రోవైపు, రాజధాని అమరావతిని తరలించవద్దంటూ వెలగపూడిలో ఇద్దరు యువకులు చేపట్టిన 151 గంటల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. రవి - శ్రీకర్ ల నిరాహారదీక్ష నాల్గో రోజుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందికి బుద్ధి రావాలని - తమ గురించి ఆలోచిస్తారని కోరుకుంటూ ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కొక్క గంట చొప్పున కేటాయిస్తూ 151 గంటల నిరాహారదీక్షకు దిగామని అంటున్నారు. ‘మూడు రాజధానులు’ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేని కాన్సెప్ట్ అని విమర్శించారు.