Begin typing your search above and press return to search.

కోవింద్ నామినేష‌న్ కాదు..బీజేపీ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌!

By:  Tupaki Desk   |   24 Jun 2017 4:35 AM GMT
కోవింద్ నామినేష‌న్ కాదు..బీజేపీ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌!
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా నిన్న ఢిల్లీలోని పార్ల‌మెంటులో ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ అట్ట‌హాసంగా జ‌రిగింది. ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాల‌తో పాటు మ‌రికొన్ని రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ ప్ర‌తినిధుల‌ను అక్క‌డికి పంపాయి. దీంతో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎన్డీఏ అభ్య‌ర్థిగా కోవింద్ నిన్న మూడు సెట్ల నామినేష‌న్ ప‌త్రాలను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ నామినేష‌న్ల‌లో ఒక్కో దానిపై కోవింద్ అభ్య‌ర్థిత్వాన్ని ఒక‌రు ప్ర‌తిపాదిస్తే... దానిని బ‌ల‌ప‌రుస్తూ ఒక్కో దానిపై ఏకంగా 50 మంది సంత‌కాలు చేశారు.

అంటే కేవ‌లం మూడు సెట్ల నామినేష‌న్ల‌పై సంత‌కాలు చేసేందుకే అక్క‌డికి అతిర‌థ మ‌హార‌థులైన 153 మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌చ్చార‌న్న మాట‌. ఇక వారి వెంట వారి అనుచ‌ర వ‌ర్గం, ఆయా పార్టీల ముఖ్య నేత‌లు త‌ర‌లిరావ‌డంతో పార్ల‌మెంటు నిజంగానే కిట‌కిట‌లాడిపోయింది. అంత‌మంది రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను ఒకేసారి ఒకేచోట చూసిన మీడియా ప్ర‌తినిధులు విరామం లేకుండా త‌మ కెమెరాల‌కు ప‌నిచెప్పాల్సి వచ్చింది. ఈ సంద‌ర్భంగా నాన్ స్టాప్‌ గా ప‌నిచేసిన మీడియా ప్ర‌తినిధులు... కోవింద్ నామినేష‌న్ ఘ‌ట్టాన్ని బీజేపీ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు వినియోగించుకుంద‌ని గుస‌గుస‌లాడుకున్నార‌ట‌.

అయినా ఈ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎవ‌రెవ‌రు వ‌చ్చారంటే... బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ - బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ - ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి - కేంద్ర కేబినెట్‌ లోని మెజారిటీ మంత్రులు - 28 రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు - 15 రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అక్క‌డికి త‌ర‌లివ‌చ్చారు. అందుకేనేమో... తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్ర‌బాబునాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావులకు తొలి వ‌రుస‌లో అస‌లు చోటే చిక్క‌లేదు. ఎన్డీఏలో భాగ‌స్వామి కాని టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే... ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న చంద్ర‌బాబుకు కూడా తొలి వ‌రుస‌లో చోటు చిక్క‌లేదంటే... బీజేపీ ఈ కార్య‌క్ర‌మాన్ని త‌న బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదిక‌గా చేసుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/