Begin typing your search above and press return to search.

ద్రౌపది ముర్ము : రాష్ట్రపతిభవన్ లో శతదళ శోభిత వికసిత కమలం

By:  Tupaki Desk   |   21 July 2022 4:49 PM GMT
ద్రౌపది ముర్ము : రాష్ట్రపతిభవన్ లో శతదళ శోభిత వికసిత కమలం
X
ఆమె భారత దేశ రాజకీయ చరిత్రను సరికొత్త మలుపు తిప్పారు. ఏడున్నర పదుల దేశ స్వాతంత్ర చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసీ మహిళ ప్రధమ పౌరురాలిగా నిలిచి గెలిచి సంచలనం సృష్టించారు. రాజ్యాంగ పరిరక్షురాలిగా ఆమె దేశాన్ని శాసించనున్నారు. ప్రతిభా పాటిల్ తరువాత రాష్ట్రపతి అయిన రెండవ మహిళగా కూడా రికార్డుని సొంతం చేసుకున్నారు.

బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలిచి మంచి మెజారిటీతో గెలిచిన ద్రౌపది ముర్ము ఈ దేశ మూలవాసులకు ఒక ఉదాహరణ. ఈ దేశంలోని అణగారిన వర్గాలకు ఒక ఆలంబన. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి దేశంలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ద్వారా ఆమె ఒక అద్భుత సందేశాన్ని దేశానికి ఇచ్చారు.

ఆనె నడత, వ్యక్తిత్వం దేశంలోని మొత్తం భారతీయులకు ఆదర్శం. ఆమె ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని ప్రారభ్మించి ఆ మీదట రాజకీయాల్లోకి ప్రవేశించి రెండు మార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గవర్నర్ గా పనిచేసి ఈ రోజున దేశాధినేతగా కీలక హోదాకు చేరుకున్నారు.

తన జీవితంలో ఎన్నో ఎత్తులను చూసినా కూడా ఆమెలో నిరాడంబరత ఎక్కడా పోలేదు. సర్వసాధారణ మహిళగానే ఆమె తనను భావించుకుంటూ ఉంటారు. ఆ అరుదైన వ్యక్తిత్వమే ఆమెను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టింది. ఒక గిరిపుత్రిక ఈ దేశ ఉన్నత సింహాసనాన్ని అధిరోహించడం అంటే అది ప్రజాస్వామ్యం గొప్పదనంగా భావించాలి.

అదే సమయంలో ఆమె ఈ దేశానికి తన పనితీరు ద్వారా మరిన్ని ఉత్తమ సంప్రదాయాలను ప్రోదిచేసి రేపటి తరాలకు అందిస్తారని అంతా భావిస్తున్నారు. ఆశిస్తున్నారు.

ఇక తన ప్రత్యర్ధిగా ఉన్న యశ్వంత్ సిన్ హా మీద భారీ మెజారిటీతో గెలిచిన ద్రౌపది ముర్ముకు 5 లక్షల 77 వేల 777 ఓట్లు లభించాయి. ఇక ఆమెకు మొత్తం ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజిలో ఉన్న ఓట్లలో 68. 87 శాతం ఓట్లు రావడం విశేషం. ఈ నెల 25న ద్రౌపది ముర్ము ఈ దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.