Begin typing your search above and press return to search.

కరోనా వేళ..సొంతూరికెళ్లేందుకు అదిరే ప్లాన్ ఫ్లాపైంది

By:  Tupaki Desk   |   26 March 2020 2:29 PM GMT
కరోనా వేళ..సొంతూరికెళ్లేందుకు అదిరే ప్లాన్ ఫ్లాపైంది
X
కరోనా వైరస్ నేపథ్యంలో దేశం యావత్తు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వచ్చే నెల 14 దాకా కొనసాగనున్న లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా పూర్తిగానే స్తంభించింది. కరోనాను కట్టడి చేయాలంటే... ఎక్కడి వారక్కడే ఉండాలని అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పిలుపునిస్తున్నాయి. ఈ పిలుపు దాదాపుగా అన్ని వర్గాలకు అనువుగానే ఉన్నా... దినసరి కూలీలు - వలస కూలీలకు మాత్రం కాస్తంత ఇబ్బందిగానే మారింది. దినసరి కూలీలపై లాక్ డౌన్ ఓ మోస్తరు ప్రభావాన్నే చూపుతున్నా... వలస కూలీలపై మాత్రం పెను ప్రభావాన్నే చూపుతోంది. ఎందుకంటే... పని కోసం వలస వెళ్లిన చోట కూలీలకు లాక్ డౌన్ తో పని దొకరడం లేదు. అలాగని పనిలేదు కదా సొంతూరికి వెళదామంటే రవాణా సౌకర్యం లేదు. మరి పనికోసం వెళ్లిన చోట పని లేకపోతే.. పూట గడవదు కదా. ఈ క్రమంలో సొంతూరికి ఎలాగైనా చేరాలన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకుల అదిరేటి ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.

ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్‌ నోర్‌ జిల్లాకు చెందిన 16 మంది డెహ్రాడూన్‌ లో పనిచేస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అక్కడే ఇరుక్కుపోయారు. ఎలాగైనా ఊరికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న వారు ఓ ఉపాయం ఆలోచించారు. పాల ట్యాంకును పోలీసులు అడ్డగించరనే ఉద్దేశ్యంతో ఖాళీగా ఉన్న దాంట్లో దాక్కున్నారు. కానీ, పాల ట్యాంకు బిజ్‌ నోర్‌ జిల్లాలోని నాజిబాబాద్‌ లోకి రాగానే పోలీసులు దాన్ని అడ్డగించి చెక్‌ చేశారు. దీంతో ఆ 16 మంది బయటకు రాక తప్పలేదు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసే విధంగా నడుచుకున్నందుకు గానూ పోలీసులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.

పని కోసం వెళ్లిన చోట పనులు దొరకని నేపథ్యంలో పస్తులు ఉండే కంటే... ఎలాగోలా కాస్త కష్టమైనా కూడా సొంతిళ్లకు చేరదామన్న భావనతోనే ఈ యువకులు ఇలా పాల వ్యాన్ ను ఆశ్రయించారు. అయితే... అత్యవసర సేవలకు చెందిన వాహనాల్లో గుట్టుగా ప్రజా రవాణా సాగుతోన్న ఘటనలు కొన్ని బయటపడటంతో పోలీసలు కూడా ఎమర్జెన్సీ సర్వీసులకు చెందిన వాహనాలను కూడా తనిఖీ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే బిజ్ నోర్ యువకుల ప్రయాణ పాట్లు వెలుగులోకి వచ్చాయి. ఇలా పాల వ్యాన్ లో సొంతూరికి బయలుదేరి అడ్డంగా దొరికిపోయిన వీరిపై పోలీసులు ఎలాంటి కేసులు పెడతారో చూడాలి.