Begin typing your search above and press return to search.

లేటెస్ట్‌: ఫ్రాన్స్ లో ఇప్పుడేం జ‌రుగుతోంది..?

By:  Tupaki Desk   |   16 Nov 2015 1:40 PM GMT
లేటెస్ట్‌: ఫ్రాన్స్ లో ఇప్పుడేం జ‌రుగుతోంది..?
X
ఫ్రాన్స్ దేశ చ‌రిత్ర‌లో క‌నివినీ ఎరుగ‌ని న‌ర‌మేధం జ‌రిగి రెండు రోజులు దాటింది. విచ‌క్ష‌ణార‌హితంగా ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పులు.. పేలుళ్ల కార‌ణంగా 129 మంది అమాయ‌కుల ప్రాణాలు గాల్లో కలిసిపోవ‌టం తెలిసిందే. ఫ్రాన్స్ దేశానికి భారీ షాక్ ఇచ్చిన ప్యారిస్ దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇప్పుడా దేశంలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఉగ్ర‌వాదుల తాజా దాడితో ఫ్రాన్స్ స‌ర్కారు మైండ్‌ సెట్ పూర్తిగా మారిపోయింద‌ని చెబుతున్నారు. ఉగ్ర‌వాదుల మీద క‌రుకుగా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. దేశంలో వారి ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఫ్రాన్స్ లో ప‌లు ప‌రిణామాలు వేగంగా జ‌రిగిపోతున్నాయి.

= ప్యారిస్ పేలుళ్ల నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌జ‌లు ఉగ్ర షాక్ నుంచి ఇంకా కోలుకోని ప‌రిస్థితి. ఇక‌.. ఉగ్ర‌వాదుల న‌ర‌మేధానికి ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన ప్యారిస్ న‌గ‌రంలో ప‌రిస్థితి ఇంకా సాధార‌ణ స్థితి రాలేదు. ఉగ్ర‌వాదులు.. వారి సంబంధికుల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు జ‌రుపుతుంటే.. ప్యారిస్ న‌గ‌రంలో స్థానిక ముస్లింల‌పై సందేహాలు మ‌రింత భారీగా పెరిగిపోతున్నాయి. వారిని అనుమానం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది.

= ఇక దేశంలో రాడిక‌ల్ ముస్లిం ఇమాంల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది. ఉగ్ర‌వాద కార్య‌క‌ల‌పాల‌కు స‌హ‌క‌రిస్తున్న వారిని.. ప్రేరేపిస్తున్న వారిని దేశ బ‌హిష్క‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఫ్రాన్స్ లో మొత్తం 168 చోట్ల దాడులు నిర్వ‌హించి మొత్తం 104 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌కు దేశంలోని ముస్లింలు కొంద‌రు స‌హ‌క‌రించార‌న్నది స్ప‌స్ట‌మైంది.

= ఫ్రాన్స్ దేశంలోని ప‌లు ప‌ట్ట‌ణాల్లో పోలీసులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఉగ్ర‌వాదుల‌తో సందేహాలున్న వారి ఇళ్ల‌పైనా దాడులు నిర్వ‌హిస్తున్నారు. కొన్ని న‌గ‌రాల్లో అయితే వీటి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. లియోన్ సిటీలో 13 చోట్ల‌.. తులుస్ సిటీలోనూ ప‌లు దాడులు నిర్వ‌హించి.. ప‌లువురు అనుమానితుల్ని.. ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

= ప్యారిస్ పేలుళ్ల సూత్ర‌ధారిగా భావిస్తున్న స‌లేహ్ ను పోలీసులు ప్ర‌శ్నించి మ‌రీ వ‌దిలేసిన ఘ‌ట‌న ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. ప్యారిస్ పేలుళ్లు జ‌రిగిన వెంట‌నే ఫోక్స్ వ్యాగ‌న్ కంపెనీకి చెందిన పోలో కారులో ముగ్గురు వ్య‌క్తులు స‌రిహ‌ద్దుల్లోకి రావ‌టం.. వారిలో స‌లేహ్ ఒక‌రు కావ‌టం గ‌మ‌నార్హం. వారిని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగిన అనంత‌రం.. స‌రిహ‌ద్దు అధికారులు వ‌దిలేశారు. ఉగ్ర‌వాద దాడిలో అతిముఖ్య‌మైన స‌లేహ్ ను వ‌దిలేయ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చేతికి చిక్కిని ఉగ్ర‌వాదిని చేతులారా సాగ‌నంప‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అయితే.. తాము ప్ర‌శ్నించిన వారిపై లుకౌట్ నోటీసులు లేక‌పోవ‌టంతో వ‌దిలేయాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఉగ్ర‌దాడి త‌ర్వాత దాదాపు మూడు గంట‌ల త‌ర్వాత మాత్ర‌మే స‌రిహ‌ద్దుల మూసివేత‌.. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు అయ్యాయి. అదే ప్ర‌మాద‌క‌ర ఉగ్ర‌వాది త‌ప్పించుకోవ‌టానికి కార‌ణ‌మైంది.

= ఫ్రాన్స్ లో ప్ర‌స్తుతం విధించిన ఎమ‌ర్జెన్సీని కొంత‌కాలం పొడిగించే అంశంపై ఫ్రాన్స్ అధ్య‌క్షుడు అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఉగ్ర‌వాదుల్ని పూర్తిగా ఏరివేయ‌టానికి వీలుగా.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని కొంత‌కాలం కొన‌సాగించ‌టం మంచిద‌న్న భావ‌నలో దేశాధ్య‌క్షుడు ఉన్న‌ట్లు చెబుతున్నారు.