Begin typing your search above and press return to search.

అమిత్ షా నోటి నుంచి మాట వ‌చ్చిన గంటల్లోనే..

By:  Tupaki Desk   |   19 Sep 2016 4:35 AM GMT
అమిత్ షా నోటి నుంచి మాట వ‌చ్చిన గంటల్లోనే..
X
వ‌రంగ‌ల్ లో భారీ బ‌హిరంగ సంద‌ర్భంగా బీజేపీ చీఫ్ అమిత్ షా నోటి నుంచి ఒక మాట వ‌చ్చింది. స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితులు గ‌తంలోమాదిరి లేవ‌ని.. దాయాది పాకిస్థాన్ చేష్ట‌ల్ని క‌ట్ట‌డి చేశామ‌ని.. వారు ఒక బుల్లెట్ పేలిస్తే.. మ‌న‌వాళ్లు గ‌ట్టిగా ప్ర‌తిస్పందిస్తున్నార‌ని.. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం చాలానే మార్పు వ‌చ్చినట్లు చెప్పుకొచ్చారు. అమిత్ షా నోటి నుంచి ఈ మాట‌లు వ‌చ్చిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. స‌రిహ‌ద్దుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోనంత దారుణానికి పాక్ పాల్ప‌డింది.

జ‌మ్ము క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లోని యూరీ సైనిక పోస్ట్ మీద‌కు తెగ‌బ‌డ్డ‌ న‌లుగురు ఉగ్ర‌వాదుల కార‌ణంగా 17 మంది వీర జ‌వాన్లు ప్రాణాలు విడ‌వాల్సి వ‌చ్చింది. కొద్దిరోజుల క్రితం ఉగ్ర‌దాడికి సంబంధించి స‌మాచారం అందించి అలెర్ట్ చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఉగ్ర‌వాదులు నియంత్ర‌ణ రేఖ కంచెను క‌త్తిరించి భార‌త్ లోకి అడుగుపెట్టారు. పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ద్వారా భార‌త్ భూభాగంలోకి అడుగుపెట్టిన వారు.. న‌డుచుకుంటూ స‌రిహ‌ద్దుకు కేవ‌లం ఆరు కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న టెన్ డోగ్రా రెజిమెంట్ కు చేరుకున్నారు.

యూరీ ద‌గ్గ‌రి టెన్ డోగ్రా రెజిమెంట్ గురించి కాస్త చెప్పుకోవాల్సి ఉంది. ఇటీవ‌ల స‌రిహ‌ద్దుల్లో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సైనిక స్థావ‌రాన్ని బ‌లోపేతం చేశారు. ఈ స్థావ‌రంలో 12 వేల‌కుపైగా సైనికులు ఉన్నారు. వేలాది మంది గుడారాల్లో ఉన్న నేప‌థ్యంలో తీవ్ర‌వాదులు త‌మ టార్గెట్ గా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఏకే 47 రైఫిల్స్ చేత‌బ‌ట్టిన న‌లుగురు ఉగ్ర‌వాదులు.. సైనిక స్థావ‌రంలోకి అడుగుపెట్టినంత‌నే విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఊహించ‌ని ఈ ప‌రిణామానికి తేరుకునే లోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. కాల్పుల ధాటికి ప‌లువురు సైనికులు వీర మ‌ర‌ణం చెంద‌గా.. కాల్పుల కార‌ణంగా జ‌వాన్లు బ‌స చేసిన టెంట్లు ఆగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మంట‌ల్లో చిక్కుకొని నిద్ర‌లో ఉన్న‌జ‌వాన్లు 14 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.

ఉగ్ర‌వాదులు వ‌చ్చీ రావ‌టంతోనే ఓప‌క్క కాల్పులు.. మ‌రోప‌క్క గుడారాల‌పై గ్రైనెడ్లు విస‌రటంతో అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. సైనికులు తిరిగి స్పందించేస‌రికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. 17 మంది వీర‌జ‌వాన్లు మ‌ర‌ణించ‌గా.. దాడికి పాల్ప‌డ్డ న‌లుగురు ఉగ్ర‌వాదుల్ని సైనికులు చంపేశారు. ఈ చ‌ర్య ముమ్మాటికి పాక్ ప‌నే అని భార‌త్ ఆరోపించ‌గా.. ఇది తొంద‌ర‌పాటు చ‌ర్య అని.. ఆధారాలు చూపించాల్సిందిగా పాక్ ఎప్ప‌టిలానే త‌న‌దైన తొండిమాట‌ల్ని ప్ర‌ద‌ర్శించి. ఇప్ప‌టికి ప‌లుమార్లు పాక్ ప్రోద్బ‌లంతోనే భార‌త్‌లో ఉగ్ర‌దాడులు జ‌రిగిన‌ట్లుగా ఆధారాల‌తో స‌హా నిరూపించినా.. పాక్ త‌న బుద్ధిని మార్చుకోలేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.వ‌రంగ‌ల్‌ స‌భ‌లో దెబ్బ‌కు భారీ దెబ్బ‌తో బ‌దులిస్తామ‌ని వీరావేశంతో మాట‌లు చెప్పిన అమిత్ షా మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. క‌ప‌ట‌త్వంతో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న నీచ‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించే పాక్‌ కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విదేశీ ఉగ్ర‌వాదులు తెగ‌బ‌డిన తాజా ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. గ‌తానికి భిన్నంగా ప‌లువురు నేత‌లు.. కొంద‌రు ప్ర‌ముఖులు దెబ్బ‌కు దెబ్బ తీయాల్సిందేన‌న్న‌ట్లుగా త‌మ అభిప్రాయాల్ని సోష‌ల్ మీడియాలోనూ.. మీడియాతోనే మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.