Begin typing your search above and press return to search.

కడుపునొప్పి అంటూ ఇంత పెద్ద నాటకం ఆడిందా?

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:55 AM GMT
కడుపునొప్పి అంటూ ఇంత పెద్ద నాటకం ఆడిందా?
X
లోకంలో మానవత్వం అనేది రోజురోజుకు చచ్చిపోతోంది. కర్నూలులో తాజాగా జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్నూలు ఆస్పత్రికి సాధారణ కడుపు నొప్పి అంటూ తల్లితో కలిసి వచ్చింది ఓ 17 ఏళ్ల అవివాహిత యువతి. ఆమెను అనుమానించిన డాక్టర్లు ఆమెను ప్రసూతి వార్డుకు పంపారు. పరీక్షించిన ప్రసూతి డాక్టర్లు ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని, నెలలు నిండితే వచ్చే నొప్పులని తెలిపారు.

అయితే ఆ యువతి నేను కడుపునొప్పితో మాత్రమే బాధపడుతున్నానని గర్భిణీని కాదంటూ వైద్యులతో వాగ్వివాదానికి దిగడం గమనార్హం. యువతేననుకుంటే ఆమె తల్లి నాలుగు ఆకులు ఎక్కువ చదివింది. తన కుమార్తె కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగిందని అందుకే ఆమె కడుపు ఎత్తుగా కనిపిస్తోందని కల్లిబొల్లి కబుర్లు చెప్పింది. ఆమెకు పెళ్లే కాలేదని, కడుపు నొప్పికి మందులు ఇస్తే వెళ్లిపోతామని కట్టుకథలు అల్లింది. అయితే ఆమెకు వైద్యులు అల్ట్రాస్కానింగ్ పరీక్షలు నిర్వహించి అమ్మడి గుట్టు రట్టు చేశారు.

స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రిలోనే బాత్ రూమ్ కు వెళ్లి పండంటి మగ బిడ్డను ప్రసవించింది. అయితే బిడ్డ బాత్ రూమ్ లో ఉన్న లెట్రిన్ బేసిన్లో పడి చనిపోయాడు. అప్పటికీ బుద్ధి మారని ఆ యువతి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి డాక్టర్ల దగ్గరకు వెళ్లి కడుపునొప్పికి మందులు ఇవ్వమని కోరింది. డాక్టర్లు నిలదీయగా తనకు ఇంకా పెళ్లి కాలేదని, బయట తెలిస్తే పరువుపోతుందని యువతి చెప్పడం కొసమెరుపు.